Vehicle Sales : రికార్డుల మోత.. 42 రోజుల పండుగ సీజన్‌లో 52 లక్షల వాహనాల అమ్మకం
42 రోజుల పండుగ సీజన్‌లో 52 లక్షల వాహనాల అమ్మకం

Vehicle Sales : దేశంలో ఆటోమొబైల్ రంగానికి ఈ ఏడాది పండుగ సీజన్ చారిత్రక విజయాన్ని తెచ్చిపెట్టింది. గత 42 రోజుల పండుగ సీజన్‌లో, దేశవ్యాప్తంగా వాహనాల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ 42 రోజుల్లో 52 లక్షల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 21% పెరిగాయి. జీఎస్‌టీ రేట్ల సవరణ తర్వాత వాహనాల ధరలు తగ్గడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడం వంటివి ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 42 రోజుల పండుగ సీజన్ దేశంలోని ఆటో రిటైల్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ పండుగ సీజన్‌లో ఏకంగా 52,38,401 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 43,25,632 యూనిట్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలు గత ఏడాది కంటే ఏకంగా 21% వృద్ధిని నమోదు చేశాయి.
జీఎస్‌టీ రేట్లలో మార్పులు చేయడం వలన వాహనాల ధరలు తగ్గడం, ఇది కొనుగోలుదారులలో ఉత్సాహాన్ని పెంచడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. FADA అధ్యక్షుడు సి.ఎస్. విగ్నేశ్వర్ ఈ సీజన్‌ను చారిత్రక సమయంగా అభివర్ణించారు. మొత్తం అమ్మకాల వృద్ధిలో ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విభాగంలో రిజిస్ట్రేషన్లు 23% పెరిగి 7,66,918 యూనిట్లకు చేరుకున్నాయి (గత ఏడాది: 6,21,539 యూనిట్లు). పన్నులు తగ్గడం వల్ల కాంపాక్ట్, సబ్-4-మీటర్ కార్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. అనేక మోడళ్లకు సంబంధించి, మార్కెట్‌లో సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు ఫాడా తెలిపింది.
టూ-వీలర్ అమ్మకాలు 22% పెరిగి 40,52,503 యూనిట్లకు చేరుకున్నాయి (గత ఏడాది: 33,27,198 యూనిట్లు). గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కొనుగోలు శక్తి, జీఎస్‌టీ ఉపశమనం, వినియోగదారుల విశ్వాసం పెరగడం వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయి. కమ్యూటర్ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు, టూ-వీలర్లతో పాటు, ఇతర ఆటో విభాగాల్లో కూడా మంచి వృద్ధి కనిపించింది. త్రీ-వీలర్ అమ్మకాలలో 9%, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలలో 15% వృద్ధి నమోదైంది.
పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్ నెలలో ఆటో రిటైల్ అమ్మకాలు ఏకంగా 41% వార్షిక వృద్ధిని నమోదు చేసి, మొత్తం 40,23,923 యూనిట్లకు చేరుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 11% పెరిగాయి. టూ-వీలర్ అమ్మకాలు భారీగా 52% వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్‌టీ 2.0 అమలు తర్వాత ప్రారంభంలో కొంత మందకొడితనం ఉన్నప్పటికీ, అక్టోబర్‌లో డిమాండ్ వేగంగా పుంజుకుని అమ్మకాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని విగ్నేశ్వర్ తెలిపారు.

