కలర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Honda Shine 125 : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌తో మార్కెట్లో మళ్ళీ సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమైంది. ఈసారి కంపెనీ తన పాపులర్ బైక్ హోండా షైన్ 125, స్పోర్టీ స్కూటర్ హోండా డియో 125లలో సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‎లను రంగంలోకి దించింది. కేవలం రంగులు, గ్రాఫిక్స్‌తోనే మ్యాజిక్ చేస్తూ ఈ వాహనాలకు అదిరిపోయే ప్రీమియం లుక్ ఇచ్చింది హోండా. సాధారణ మోడల్స్ కంటే భిన్నంగా ఉండాలనుకునే కుర్రకారును దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ ఎడిషన్లను డిజైన్ చేశారు.

హోండా షైన్ 125 అంటేనే నమ్మకానికి మారుపేరు. ఇప్పుడు దీనికి మరింత మెరుగులు అద్దుతూ లిమిటెడ్ ఎడిషన్‎ను హోండా తీసుకువచ్చింది. ఇది ప్రస్తుత షైన్ 125 డిస్క్ వేరియంట్‌పై ఆధారపడి రూపొందించబడింది. ఇందులో పెర్ల్ సైరన్ బ్లూ అనే సరికొత్త రంగును పరిచయం చేశారు. బైక్ ట్యాంక్‌పై ఉన్న గ్రాఫిక్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, దీని వీల్ రిమ్స్ కు పైరైట్ బ్రౌన్ కలర్ పెయింట్ వేశారు, ఇది బైక్ కు ఒక విలాసవంతమైన రూపాన్ని ఇస్తోంది. మెకానికల్ పరంగా చూస్తే.. ఇందులో 123.94cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది, ఇది 10.6bhp పవర్, 11Nm టార్క్‌ను అందిస్తుంది. దీని ధర సాధారణ డిస్క్ వేరియంట్ కంటే రూ.1,500 నుండి రూ.2,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు.

కేవలం బైక్ మాత్రమే కాకుండా, హోండా తన పాపులర్ స్కూటర్ డియోలో కూడా డియో 125 X-ఎడిషన్‎ను ప్రవేశపెట్టింది. యువతను ఎక్కువగా ఆకర్షించే ఈ స్కూటర్ ఇప్పుడు మరింత స్పోర్టీగా మారింది. ఇది టాప్-స్పెక్ H-స్మార్ట్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెర్ల్ సైరన్ బ్లూ, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. బాడీ ప్యానెల్స్ పై గ్రే ఎలిమెంట్స్, రెడ్ కలర్ వీల్స్ ఈ స్కూటర్ కు ఒక రేసింగ్ లుక్ ను ఇస్తున్నాయి. గ్రాఫిక్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి. దీని ధర కూడా H-స్మార్ట్ వేరియంట్ (సుమారు రూ. 91,683) కు దరిదాపుల్లోనే ఉండే అవకాశం ఉంది.

హోండా ఈ రెండు వాహనాల్లోనూ ఇంజన్ లేదా పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం కాస్మెటిక్ మార్పులతోనే వాహనానికి కొత్తదనాన్ని తీసుకువచ్చింది. షైన్ 125లో డార్క్ బ్లూ ఫినిషింగ్, బ్రౌన్ వీల్స్ క్లాసీగా అనిపిస్తుంటే, డియో 125లో రెడ్ వీల్స్, బ్లూ-గ్రే కాంబినేషన్ మాస్ లుక్ ఇస్తోంది. మార్కెట్లో హీరో గ్లామర్, బజాజ్ పల్సర్ 125, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాహనాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి హోండా ఈ లిమిటెడ్ ఎడిషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది.

ప్రస్తుతం పండుగ సీజన్ లేకపోయినా, సేల్స్ ను పెంచుకోవడానికి ఇలాంటి స్పెషల్ ఎడిషన్లు కంపెనీలకు బాగా కలిసివస్తాయి. షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ త్వరలోనే షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే షైన్, డియో మోడల్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది, ఇప్పుడు ఈ సరికొత్త రంగుల చేరికతో ఆ డిమాండ్ రెట్టింపు అవ్వడం ఖాయం. ముఖ్యంగా డియో 125 X-ఎడిషన్ లో ఉన్న H-స్మార్ట్ టెక్నాలజీ (కీలెస్ స్టార్ట్) తో పాటు ఈ కొత్త లుక్ కుర్రకారును క్యూ కట్టేలా చేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story