Honda: ఎలక్ట్రిక్ విభాగంలోకి హోండా గ్రాండ్ ఎంట్రీ.. డిసెంబర్ 2న మార్కెట్లోకి ఫస్ట్ కారు
మార్కెట్లోకి ఫస్ట్ కారు

Honda: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటివరకు పెట్రోల్, హైబ్రిడ్ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జపాన్ సంస్థ హోండా, ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెడుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిసెంబర్ 2, 2026న భారతీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన జీరో ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా ఈ సరికొత్త కారు రూపుదిద్దుకుంది. దేశీయ విపణిలో ఈవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హోండా ఈ కీలక ముందడుగు వేస్తోంది.
మోడ్రన్ ఎక్స్టీరియర్ లుక్
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ విషయానికి వస్తే జీరో ఆల్ఫా కాన్సెప్ట్‌లోని అనేక ఆధునిక అంశాలు ఇందులో కనిపించనున్నాయి. ఎత్తైన రూఫ్‌లైన్, విశాలమైన గ్లాస్ ఏరియాతో దృఢమైన బాక్సీ ఎస్యూవీ రూపాన్ని దీనికి అందించారు. ముందు భాగంలో ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యేకమైన క్లోజ్డ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైటింగ్ సెటప్, భారీ బంపర్ ఉండనున్నాయి. అలాగే ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు నిటారుగా ఉండే టెయిల్‌గేట్, రూఫ్ స్పాయిలర్ ఈ కారుకు ప్రీమియం స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.
ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు, ఏడీఏఎస్ భద్రత
కారు లోపలి భాగం అత్యంత ఆధునికంగా, మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో ఉండనుందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పెద్ద ల్యాండ్‌స్కేప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రత్యేక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంటాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు ప్రయాణికుల రక్షణ కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి కీలక భద్రతా ఫీచర్లను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది. అయితే పూర్తిస్థాయి స్పెసిఫికేషన్లపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
భారత్‌లోనే తయారీ
హోండా సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనుండటం విశేషం. కేవలం దేశీయ అవసరాలకే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఇక్కడి నుంచే ఈ కార్లను ఎగుమతి చేయాలని సంస్థ ప్రణాళికలు రచించింది. తద్వారా హోండా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన వ్యూహంలో భారత్ ఒక కీలక తయారీ కేంద్రంగా మారనుంది. భారత రోడ్లపైకి వచ్చిన తర్వాత ఈ కారు ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఇ-విటారా, టాటా సియెర్రా ఈవీ వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

