హోండా 0 సిరీస్ ఈవీతో పెట్రోల్ బంకులకు సెలవు

Honda 0 Alpha EV : ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రోడ్ టెస్టింగ్‌ను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్ నుంచి ఈ టెస్టింగ్ వాహనాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. భారతీయ రోడ్లు, ఇక్కడి ట్రాఫిక్, విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారు పనితీరును పరీక్షించడమే ఈ పబ్లిక్ రోడ్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రోటోటైప్‌ను మొదటిసారిగా జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రపంచానికి పరిచయం చేశారు. హోండా సరికొత్త థిన్, లైట్ అండ్ వైజ్ ఫిలాసఫీతో ఈ కారును రూపొందించారు. అంటే కారు బరువు తక్కువగా ఉంటూనే, లోపల ఎక్కువ స్థలం ఉండేలా డిజైన్ చేశారు. ఈ కారులో 60kWh నుంచి 75kWh వరకు ఉండే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

భారతదేశంలో ఈ కారును కఠినమైన పరీక్షలకు గురిచేస్తున్నారు. వేసవిలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలు, విభిన్న రకాల ఛార్జింగ్ స్టేషన్ల వద్ద దీని సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా సీఈఓ తాకాషి నకాజిమా మాట్లాడుతూ.. "భారతదేశానికి విభిన్నమైన డ్రైవింగ్ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా అత్యంత నమ్మదగిన, సౌకర్యవంతమైన ఈవీని అందించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు.

మరో విశేషమేమిటంటే.. ఈ హోండా 0 ఆల్ఫా ఈవీని భారతదేశంలోనే ఉత్పత్తి చేయబోతున్నారు. దీని కోసం కంపెనీ సుమారు రూ.1200 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇక్కడి ప్లాంట్ నుంచి తయారైన కార్లను కేవలం భారత్‌లో అమ్మడమే కాకుండా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఈ కారులో లెవల్-2 అడాస్ (ADAS), 360-డిగ్రీ కెమెరా, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. మార్కెట్లోకి 2026-27 ఆర్థిక సంవత్సరంలో విడుదల కాబోతున్న ఈ కారు, టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story