Activa 125 vs Jupiter 125 : హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్.. 2026లో ఏ స్కూటర్ ‘రియల్ కింగ్’?
2026లో ఏ స్కూటర్ ‘రియల్ కింగ్’?

Activa 125 vs Jupiter 125 : భారతీయ రోడ్లపై స్కూటర్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 125cc సెగ్మెంట్‌లో హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. మైలేజీ కావాలా? లేక ఫీచర్లు కావాలా? అనే సందిగ్ధంలో ఉన్న రైడర్ల కోసం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను, ఏది మీ అవసరాలకు సరిపోతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధరల మధ్య వ్యత్యాసం
బడ్జెట్ విషయానికి వస్తే, టీవీఎస్ జూపిటర్ 125 కొంచెం తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర వేరియంట్లను బట్టి రూ.75,000 నుంచి రూ.87,000 మధ్య ఉంటుంది. అదే హోండా యాక్టివా 125 విషయానికి వస్తే, ఇది ప్రీమియం బ్రాండ్ కావడం వల్ల దీని ధర కొంచెం ఎక్కువగా ఉండి రూ.91,128 నుంచి ప్రారంభమవుతుంది. మీరు తక్కువ ధరలో మంచి స్కూటర్ కావాలనుకుంటే జూపిటర్ వైపు మొగ్గు చూపవచ్చు.
ఇంజిన్, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ పరంగా జూపిటర్ కొంచెం పైచేయి సాధిస్తోంది. జూపిటర్ 125లో 124.8 సీసీ ఇంజిన్ ఉండి 8.44 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. యాక్టివా 125లో 123.92 సీసీ ఇంజిన్ ఉండి 8.31 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండింటిలోనూ సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఉన్నప్పటికీ, రోజువారీ నగర ప్రయాణాల్లో జూపిటర్ ఇంజిన్ కొంచెం వేగంగా స్పందిస్తున్నట్లు అనిపిస్తుంది.
మైలేజ్ ఏది ఎక్కువ ఇస్తుంది?
మైలేజీ విషయంలో మాత్రం హోండా యాక్టివా 125 రారాజు అని చెప్పాలి. ఇది లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అదే టీవీఎస్ జూపిటర్ 125 విషయానికి వస్తే, ఇది సుమారు 57 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. రైడింగ్ స్టైల్ మరియు లోడ్ బట్టి ఈ అంకెల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు, కానీ మైలేజీయే ప్రధానం అనుకునేవారు యాక్టివాను ఎంచుకోవడం మంచిది.
ఫీచర్లు, సౌకర్యాలు
ఫీచర్ల విషయంలో రెండు స్కూటర్లు పోటీ పడుతున్నాయి. యాక్టివాలో ఎల్‌ఈడీ లైటింగ్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, టీవీఎస్ జూపిటర్ 125 తన 33 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో మీరు రెండు హెల్మెట్లు సులభంగా పెట్టుకోవచ్చు. అలాగే స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, యూఎస్‌బీ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు జూపిటర్‌లో అదనపు ఆకర్షణలు.
మొత్తంగా చెప్పాలంటే.. మీకు ఎక్కువ మైలేజీ, బ్రాండ్ వాల్యూ కావాలంటే హోండా యాక్టివా 125 బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా, తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ స్పేస్, అద్భుతమైన ఫీచర్లు కావాలంటే టీవీఎస్ జూపిటర్ 125 మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

