Scooter Market : ఇండియన్ స్కూటర్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. హోండా వర్సెస్ టీవీఎస్ మధ్య ముదిరిన యుద్ధం
హోండా వర్సెస్ టీవీఎస్ మధ్య ముదిరిన యుద్ధం

Scooter Market : భారతదేశంలో టూ వీలర్ మార్కెట్, ముఖ్యంగా స్కూటర్ల విభాగం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశవ్యాప్తంగా ఏకంగా 81.1 లక్షలకు పైగా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది భారత ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యధికం. అంతేకాకుండా, ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల కాలంలోనే (ఏప్రిల్-మే) 14.3 లక్షల స్కూటర్లు అమ్ముడై, గత ఏడాదితో పోలిస్తే 27 శాతం అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. అయితే ఈ భారీ మార్కెట్లో ఇప్పుడు జపాన్ దిగ్గజం హోండా, స్వదేశీ బ్రాండ్ టీవీఎస్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
హోండా యాక్టివా మార్కెట్ వాటాకు గండి
గత 25 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా హోండా యాక్టివా తిరుగులేని రారాజుగా నిలిచింది. ఒకప్పుడు మార్కెట్లో దీనికి అసలు పోటీనే లేదు. ఉదాహరణకు, 2017 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన మొత్తం 56 లక్షల స్కూటర్లలో 31.8 లక్షల బండ్లను హోండానే విక్రయించింది. అంటే అప్పట్లో హోండాకు ఏకంగా 57 శాతం మార్కెట్ షేర్ ఉండేది. కానీ, తాజా నివేదికల ప్రకారం హోండా మార్కెట్ వాటా ఇప్పుడు 39 శాతానికి పడిపోయింది. గత ఏడాది కంపెనీ మొత్తం 31.6 లక్షల స్కూటర్లను అమ్మగా, అందులో 28.45 లక్షల యాక్టివాలు, 3.13 లక్షల హోండా డియో మోడళ్లు ఉన్నాయి.
రెట్టింపు వేగంతో దూసుకొస్తున్న టీవీఎస్
హోండా మార్కెట్ తగ్గుతున్న సమయంలో టీవీఎస్ మోటార్స్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న టీవీఎస్ జూపిటర్, ఎన్‌టార్క్, జెస్ట్ వంటి పెట్రోల్ స్కూటర్లకు కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 2017 ఆర్థిక సంవత్సరంలో స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ వాటా కేవలం 14 శాతం మాత్రమే ఉండేది. కానీ, గత పదేళ్లలో కంపెనీ తన ప్లానింగ్‌తో మార్కెట్ షేర్‌ను 28 శాతానికి పెంచుకుంది. అంటే తన మార్కెట్ బలాన్ని ఏకంగా రెట్టింపు చేసుకుని హోండా సింహాసనానికి ముప్పుగా మారింది.
సేల్స్ గ్యాప్ భారీగా తగ్గింది
ఒకప్పుడు హోండా, టీవీఎస్ కంపెనీల అమ్మకాల మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉండేది. 2017 లో హోండా కంపెనీ టీవీఎస్ కంటే ఏకంగా 23.6 లక్షల స్కూటర్లను ఎక్కువగా అమ్మేది. కానీ, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా టీవీఎస్ మోడళ్లను మార్చడం వల్ల ఇప్పుడు ఆ సేల్స్ గ్యాప్ కేవలం 8.59 లక్షల యూనిట్లకు తగ్గిపోయింది. హోండా ఇప్పటికీ నంబర్-1 స్థానంలో సురక్షితంగా ఉన్నప్పటికీ, టీవీఎస్ వృద్ధి రేటు చూస్తుంటే రాబోయే రోజుల్లో హోండాకు గట్టి చెమటలు పట్టడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈవీ మార్కెట్ తెస్తున్న కొత్త ట్విస్ట్
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఈవీ రేసులో కూడా టీవీఎస్ కంపెనీ తమ ఐక్యూబ్, ఆర్బిటర్ వంటి సక్సెస్‌ఫుల్ మోడళ్లతో మార్కెట్లో దూసుకుపోతోంది. హోండా ఇంకా ఈవీ విభాగంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించకపోవడం కూడా టీవీఎస్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలే భారత టూవీలర్ మార్కెట్‌లో ఎవరు కింగ్ అనే విషయాన్ని తేల్చనున్నాయి.

