Scooter Sales: భారతీయ మార్కెట్లో స్కూటర్ల హవా.. మార్కెట్ షేర్లో యాక్టివా సరికొత్త రికార్డు
యాక్టివా సరికొత్త రికార్డు

Scooter Sales: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ మరోసారి రికార్డు స్థాయికి చేరింది. గడచిన సెప్టెంబర్ 2026 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండాకు చెందిన హోండా యాక్టివా అత్యధిక అమ్మకాలతో నెంబర్-1 స్థానంలో నిలిచింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 3,52,271 మంది కస్టమర్లు యాక్టివా స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 2025లో నమోదైన 2,37,716 యూనిట్లతో పోలిస్తే ఇది 48.19 శాతానికి పైగా అద్భుతమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. దేశంలో అమ్ముడైన మొత్తం స్కూటర్లలో ఒక్క యాక్టివా మార్కెట్ వాటానే ఏకంగా 41.82 శాతంగా ఉండటం గమనార్హం.
ఈ అమ్మకాల జాబితాలో టీవీఎస్ జుపిటర్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. జుపిటర్ సెప్టెంబర్ నెలలో 8.87 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,54,725 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో సుజుకి యాక్సెస్ నిలిచింది. యాక్సెస్ స్కూటర్ గత ఏడాదితో పోలిస్తే 0.43 శాతం స్వల్ప క్షీణతను నమోదు చేసినప్పటికీ, మొత్తం 71,928 యూనిట్ల సేల్స్‌ను సాధించి టాప్-3లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్ ఏకంగా 47.05 శాతం భారీ వార్షిక పెరుగుదలతో 45,320 యూనిట్లు అమ్ముడై జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 38.73 శాతం వృద్ధితో 42,394 యూనిట్ల విక్రయాలను జరిపింది. పెట్రోల్ వాహనాలతో పాటు కస్టమర్లు ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఈ సేల్స్ చార్ట్‌లో హీరో డెస్టినీ 125 ఆరో స్థానంలో నిలిచింది. ఇది 92.33 శాతం అసాధారణ వృద్ధితో 41,839 యూనిట్లు విక్రయించింది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న టీవీఎస్ ఎన్టార్చ్ 44.24 శాతం పెరుగుదలతో 47,955 యూనిట్లతో ఏడో స్థానంలో ఉండగా, ఎనిమిదో స్థానంలో హోండా డియో 22.37 శాతం వృద్ధితో 29,160 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా 88.28 శాతం పెరుగుదలతో 28,862 యూనిట్లు సాధించగా, పదో స్థానంలో సుజుకి బర్గ్‌మన్ 27,839 యూనిట్లతో నిలిచింది.
మొత్తంగా చూస్తే సెప్టెంబర్ 2026లో టాప్-10 స్కూటర్ల మొత్తం విక్రయాలు 32.47 శాతం పెరిగి 8,42,293 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 6,35,860 యూనిట్లుగా మాత్రమే ఉండేది. పండుగ సీజన్ ప్రారంభం కావడం, ఇంధన పొదుపు ఆధారిత మోడళ్లకు ఆదరణ పెరగడం వల్లనే స్కూటర్ల విభాగంలో ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందని ఆటోమొబైల్ రంగానికి చెందిన విశ్లేషకులు భావిస్తున్నారు.

