Honda Activa vs TVS Jupiter : భారతదేశంలో కొత్తగా స్కూటర్ కొనాలనుకునే సామాన్య వినియోగదారుడికి మార్కెట్లో ఏ మోడల్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. టూవీలర్ మార్కెట్ సేల్స్ డేటా ప్రకారం.. గత నెల మే 2026 లో కూడా ఎప్పటిలాగే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ల మధ్యే ప్రధాన పోటీ నడిచింది. అమ్మకాల సంఖ్య పరంగా హోండా యాక్టివా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, ఏడాది కాలంలో సాధించిన శాతపు వృద్ధిలో మాత్రం టీవీఎస్ జూపిటర్ బాజీ మార్చింది.

హోండా యాక్టివా రికార్డు స్థాయి అమ్మకాలు

ప్రముఖ ఆటోమొబైల్ వెబ్‌సైట్ రష్ లేన్ నివేదిక ప్రకారం.. గత నెల మే లో హోండా యాక్టివా ఏకంగా 2,28,955 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో (మే 2025) యాక్టివా సేల్స్ సంఖ్య 1,90,713 యూనిట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలో ఈ స్కూటర్ అమ్మకాలు 20.05 శాతం వృద్ధిని సాధించాయి. నమ్మకమైన ఇంజిన్, రీసేల్ వాల్యూ కారణంగా దశాబ్దాలుగా యాక్టివా తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తోంది.

కళ్లు చెదిరే వృద్ధితో టీవీఎస్ జూపిటర్ రికార్డు

ఇక ఈ రేసులో రెండవ స్థానంలో నిలిచిన టీవీఎస్ జూపిటర్ అమ్మకాల పరంగా యాక్టివా కంటే వెనుక ఉన్నప్పటికీ, వృద్ధి రేటులో మాత్రం రికార్డు సృష్టించింది. గత నెలలో జూపిటర్ స్కూటర్లు 1,24,767 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే లో ఈ సంఖ్య 97,606 యూనిట్లుగా మాత్రమే ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాది కాలంలో జూపిటర్ ఏకంగా 27.83 శాతం అద్భుతమైన గ్రోత్ రేటును నమోదు చేసింది. యాక్టివా గ్రోత్ (20.05%) తో పోలిస్తే జూపిటర్ వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.

సుజుకి యాక్సెస్‌కు తప్పని స్వల్ప నిరాశ

దేశీయ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన 125సీసీ స్కూటర్ సుజుకి యాక్సెస్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ స్కూటర్ 75,729 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే, గత ఏడాది మే లో జరిగిన 75,778 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈసారి దీని అమ్మకాలు 0.06 శాతం స్వల్పంగా తగ్గాయి. మార్కెట్లో కాంపిటీషన్ పెరగడం వల్ల సుజుకి యాక్సెస్ అమ్మకాలు ఈసారి కొద్దిగా మందగించాయి.

టాప్ 5 లో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ సేల్స్ రిపోర్ట్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాప్ 5 స్థానాల్లో రెండు ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లు చోటు దక్కించుకోవడం. నాలుగో స్థానంలో నిలిచిన టీవీఎస్ ఐక్యూబ్ గత నెలలో 42,192 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది దీని అమ్మకాలు 27,642 యూనిట్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఐక్యూబ్ ఏకంగా 52.64 శాతం బంపర్ గ్రోత్ సాధించి, టాప్-5 స్కూటర్లన్నింటిలోకి అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన మోడల్‌గా నిలిచింది. ఇక ఐదో స్థానంలో ఉన్న బజాజ్ చేతక్ ఈవీ కూడా గత నెలలో 38,376 యూనిట్లు అమ్ముడై, గత ఏడాది (25,540 యూనిట్లు) తో పోలిస్తే 50.26 శాతం భారీ వృద్ధిని కనబరిచింది. దీన్ని బట్టి కస్టమర్లు పెట్రోల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story