Honda ADV 160 : అడ్వెంచర్ లుక్, E85 ఫ్యూయల్ సపోర్ట్.. మార్కెట్‌లోకి హోండా ADV 160
మార్కెట్‌లోకి హోండా ADV 160

Honda ADV 160 : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా త్వరలోనే భారత మార్కెట్‌లో తన సరికొత్త హోండా ADV 16 స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది ఒక ప్రీమియం అడ్వెంచర్ మ్యాక్సీ-స్కూటర్. ఇటీవలే ఈ స్కూటర్‌ను భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శించారు. రాబోయే కొన్ని నెలల్లోనే ఇది కస్టమర్లకు విక్రయానికి అందుబాటులోకి రానుంది. మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇది హీరో ఎక్స్‌రూమ్ 160, యమహా ఏరోక్స్ 155, అప్రిలియా SR 175 వంటి ప్రీమియం స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. సాధారణ స్కూటర్లకు భిన్నంగా అడ్వెంచర్ బైక్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, అడ్వాన్స్డ్ ఫీచర్ల కలయికతో ఇది వస్తోంది.
లిక్విడ్-కూల్డ్ ఇంజిన్.. అదిరిపోయే పర్ఫార్మెన్స్
హోండా ADV 160 స్కూటర్‌లో 157cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. అంతర్జాతీయంగా హోండా విక్రయించే పలు ప్రీమియం స్కూటర్లలో కూడా ఇదే ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ సుమారు 16 bhp పవర్, 14.7 Nm టాక్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేలపై ప్రయాణించేటప్పుడు కూడా రైడింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉంటుంది. లిక్విడ్-కూలింగ్ సిస్టమ్ వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసినా లేదా విపరీతమైన ట్రాఫిక్‌లో నడిపినా ఇంజిన్ వేడెక్కకుండా స్థిరమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
భారత్‌లోనే తొలి E85 ఫ్యూయల్ సపోర్ట్ స్కూటర్
ఈ స్కూటర్‌లో ఉన్న అత్యంత కీలకమైన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది E85 ఫ్యూయల్‌తో నడుస్తుంది. అంటే 85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ఇందులో నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని బాగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఈ స్కూటర్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో E85 సాంకేతికతతో వస్తున్న ఏకైక స్కూటర్ ఇదే కావడం విశేషం.
అడ్వెంచర్ బైక్ తరహా మాస్ డిజైన్
హోండా ADV 160 డిజైన్ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఇది హోండాకు చెందిన పెద్ద అడ్వెంచర్ స్కూటర్ X-ADV నుంచి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎత్తైన ఫ్లైస్క్రీన్, మస్క్యులర్ బాడీ, అడ్వెంచర్ శైలి ఫ్రంట్ డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా గతుకుల రోడ్లపై కూడా బైక్ స్థిరంగా వెళ్లేందుకు వీలుగా ముందు భాగంలో 14-ఇంచ్, వెనుక భాగంలో 13-ఇంచ్ పెద్ద వీల్స్‌ను అమర్చారు.
అధునాతన ఫీచర్లు, లాంచ్ వివరాలు
ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, స్మార్ట్ కీ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్, సీటు కింద పెద్ద స్టోరేజ్ స్పేస్ మరియు ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ వంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రోజువారీ ఆఫీసు ప్రయాణాలకే కాకుండా, స్టైలిష్ లైఫ్‌స్టైల్ వాహనం కావాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని హోండా దీనిని తెస్తోంది. రాబోయే కొన్ని నెలల్లోనే దీని లాంచ్ డేట్ మరియు ధరల వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.

