Honda Alpha EV: భారతదేశంలో శరవేగంగా పెరుగుతున్న మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా అడుగుపెట్టబోతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు హోండా ఆల్ఫాను వచ్చే వారం అంటే డిసెంబర్ 2, 2026న భారత్‌లో ఆవిష్కరించనుంది. ఇది 0 ఆల్ఫా కాన్సెప్ట్ కు ప్రొడక్షన్ రూపం. అయితే ఈ కారు అమ్మకాలు మాత్రం 2027లో ప్రారంభమవుతాయి. గతేడాది అక్టోబర్ 2025లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్‌ను తొలిసారి ప్రదర్శించారు. ఇతర మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోలిస్తే దీని డిజైన్ ఎంతో భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ ఎత్తు ఉండే రూఫ్‌లైన్, వెడల్పైన స్టాన్స్, దృఢమైన వీల్ ఆర్చ్‌లు దీనికి స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. ముందు భాగంలో ఉండే డార్క్ ప్యానెల్‌లోనే హెడ్‌లైట్లు, ఛార్జింగ్ పోర్ట్, వెలిగే హోండా లోగో అమర్చారు. వెనుక భాగంలో యూ-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, నిటారుగా ఉండే టెయిల్‌గేట్ ఉన్నాయి. కాన్సెప్ట్ మోడల్‌లోని ఈ డిజైన్ అంశాలన్నీ ప్రొడక్షన్ మోడల్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.

భారతీయ రోడ్లపై టెస్టింగ్

హోండా ఆల్ఫా కారును మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చేందుకు 2026 మార్చి నుంచి భారత్‌లో విస్తృతంగా టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. కొండ ప్రాంతాలు, గుంతల రోడ్లపైనా దీని పనితీరును పరీక్షించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రాజస్థాన్‌లోని హోండా ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం. విశేషం ఏమిటంటే, ఇక్కడ తయారయ్యే కార్లను కేవలం భారత్‌లోనే కాకుండా జపాన్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకూ ఎగుమతి చేయాలని కంపెనీ ప్రణాళికలు వేస్తోంది.

360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్

రిపోర్టుల ప్రకారం హోండా ఆల్ఫాలో 65 kWh నుంచి 75 kWh కెపాసిటీ గల రెండు ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానున్న ఈ ఎస్‌యూవీ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 500 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇవ్వొచ్చని అంచనా. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్ కంట్రోల్ కోసం స్టీరింగ్ వెనుక ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్ ADAS డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, విడిగా క్లైమేట్ కంట్రోల్ బటన్లు రానున్నాయి.

క్రెటా ఈవీ, సియెర్రా ఈవీలకు గట్టి పోటీ

బ్యాటరీ కచ్చితమైన సామర్థ్యం, మోటార్ పవర్, ఛార్జింగ్ వేగం, అసలు ధర వివరాలు డిసెంబర్ 2న అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. 2027లో భారత్, జపాన్ మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాక.. హోండా ఆల్ఫా నేరుగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6, టాటా సియెర్రా ఈవీ, మారుతి సుజుకి ఇ విటారా, టయోటా ఎబెల్లా లాంటి కార్లతో గట్టిగా తలపడనుంది.

Next Story