Honda Amaze : 5-స్టార్ రేటింగ్‌తో అదరగొట్టిన హోండా అమేజ్.. ధర, ఫీచర్లు ఇవే
ధర, ఫీచర్లు ఇవే

Honda Amaze : హోండా కంపెనీకి గుడ్ న్యూస్.. హోండా అమేజ్ మూడవ తరం మోడల్‌కు భారత్ NCAP (New Car Assessment Program) నుంచి ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. భారత మార్కెట్‌లో ఈ ఘనత సాధించిన రెండవ సెడాన్ కారు ఇదే కావడం విశేషం. అమేజ్.. అడల్ట్ సేఫ్టీ విభాగంలో 5-స్టార్ రేటింగ్‌ను, చైల్డ్ సేఫ్టీ విభాగంలో 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న మూడవ తరం హోండా అమేజ్ ఆరు వేరియంట్లకు ఈ రేటింగ్ వర్తిస్తుంది.
సేఫ్టీ టెస్ట్లలో హోండా అమేజ్ అద్భుతమైన స్కోరు నమోదు చేసింది. అడల్ట్ సేఫ్టీ విభాగంలో 32కి గానూ 28.33 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.33 పాయింట్లు పొందగా, సైడ్ బారియర్ టెస్ట్‌లో 14 పాయింట్లు సాధించింది. ఈ ఫలితాల ప్రకారం.. ఈ కారు డ్రైవర్‌కు, ముందు కూర్చున్న ప్రయాణీకుడికి మెరుగైన రక్షణ అందించగలదని నిరూపించింది. చైల్డ్ సేఫ్టీ విభాగంలో 49కి గానూ 40.81 పాయింట్లు లభించాయి. 3 ఏళ్ల డమ్మీకి పూర్తి రక్షణ అందించడంలో కారు విజయవంతమైంది. అయినప్పటికీ, వెహికల్ అసెస్‌మెంట్‌లో మాత్రం 13కి కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.
సేఫ్టీ విషయంలో హోండా ఎక్కడా రాజీ పడలేదు. హోండా అమేజ్ మూడవ తరం మోడల్‌లోని అన్ని ఆరు వేరియంట్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. పిల్లల సేఫ్టీ కోసం ISOFIX (చైల్డ్ సీట్ యాంకర్స్) ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మిడ్-స్పెక్ వేరియంట్‌లో రియర్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లభిస్తాయి. టాప్ వేరియంట్‌లో అయితే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అత్యంత అడ్వాన్సుడ్ సేఫ్టీ సిస్టమ్ కూడా అందిస్తున్నారు.
హోండా అమేజ్ సెడాన్ ధర రూ.7.21 లక్షల నుంచి రూ.9.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది మిడ్‌సైజ్ సెడాన్ మార్కెట్‌లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

