Honda : ఒకేసారి 6 కార్లతో హోండా దండయాత్ర.. టయోటా, హ్యుందాయ్ షాపులు క్లోజ్
టయోటా, హ్యుందాయ్ షాపులు క్లోజ్

Honda : మనదేశంలో ఒకప్పుడు లగ్జరీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కొన్ని ఐకానిక్ కార్లు కాలక్రమేణా మార్కెట్ నుంచి తప్పుకున్నాయి. వాటిలో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండాకు చెందిన సివిక్, అకార్డ్ కార్లు టాప్‌లో ఉంటాయి. అయితే, ఇప్పుడు కార్ల లవర్స్ కు హోండా కంపెనీ ఊహించని బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో మళ్లీ తన పాత వైభవాన్ని సొంతం చేసుకోవడానికి, రాబోయే ఆర్థిక సంవత్సరం (FY2026-27) నాటికి ఏకంగా 6 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి అఫీషియల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత నిలిచిపోయిన హోండా సివిక్, అకార్డ్, సీఆర్-వీ కార్లను సరికొత్త పవర్‌ఫుల్ హైబ్రిడ్ టెక్నాలజీతో మళ్లీ దేశీయ మార్కెట్లోకి రీ-లాంచ్ చేయాలని హోండా గట్టిగా ప్లాన్ చేస్తోంది.
భారతీయ యువతను తన స్పోర్టీ లుక్‌తో ఒకప్పుడు పిచ్చెక్కించిన సెడాన్ కారు హోండా సివిక్. ఇప్పుడు ఈ కారు సరికొత్త జనరేషన్ హైబ్రిడ్ ఇంజన్‌తో ఇండియాలోకి అడుగుపెట్టబోతోంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న వివరాల ప్రకారం.. ఇందులో 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు హోండాకు చెందిన అధునాతన ఈ-డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించారు. ఈ పవర్‌ఫుల్ సెటప్ ఏకంగా 200bhp పవర్, 315Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్మూత్ డ్రైవింగ్ కోసం ఇందులో ఈ-సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉండనున్నాయి.
హోండా కంపెనీకి చెందిన అత్యంత లగ్జరీ ప్రీమియం సెడాన్ అకార్డ్ కూడా సరికొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రీ-లాంచ్ కానుంది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు హై-కెపాసిటీ ఎలక్ట్రిక్ మోటార్, అడ్వాన్స్‌డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 204bhp పవర్, 335Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీटర్లుగా కంపెనీ పేర్కొంది. ఇది మార్కెట్లోకి వస్తే టయోటా కామ్రీ కారుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
సెడాన్ కార్లతో పాటు హోండాకు చెందిన మోస్ట్ పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ హోండా సీఆర్-వీ కూడా హైబ్రిడ్ రూపంలో దేశంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో కూడా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఈ-హైబ్రిడ్ సిస్టమ్ కలయికతో 204bhp పవర్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీని ఎఫ్‌డబ్ల్యూడీ, ఆఫ్-రోడింగ్ కోసం ఏడబ్ల్యూడీ ఆప్షన్లతో తీసుకురాబోతున్నారు. అయితే, ప్రారంభంలో ఈ గ్లోబల్ కార్లను హోండా కంపెనీ సీబీయూ రూట్ ద్వారా అంటే.. విదేశాల నుంచి వంద శాతం పూర్తిగా తయారైన కార్లను నేరుగా ఇండియాకు ఇంపోర్ట్ చేయనుంది. దీనివల్ల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వరల్డ్ క్లాస్ బిల్డ్ క్వాలిటీ, అల్ట్రా లగ్జరీ ఫీచర్లు కస్టమర్లకు సొంతమవుతాయి.
కేవలం పాత కార్ల రీ-ఎంట్రీ మాత్రమే కాదు.. రాబోయే నెలల్లో సరికొత్త హోండా జెడ్ఆర్-వీ హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా ఇండియాలో లాంచ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో బాగా అమ్ముడవుతున్న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అప్‌డేట్ చేయబోతున్నారు. వీటితో పాటు 2027 ప్రారంభంలో హోండా తన మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ కారు హోండా 0 ఆల్ఫాను కూడా ఇండియాలో లాంచ్ చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. పెరిగిపోతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ సరికొత్త హైబ్రిడ్, ఈవీ కార్ల సునామీతో టయోటా, హ్యుందాయ్ లాంటి ప్రత్యర్థి కంపెనీల కోటలను బద్దలు కొట్టాలని హోండా స్మార్ట్ గేమ్ ప్లాన్ వేసింది.

