Honda CB300F : భారతీయ రోడ్లపై జపాన్ వాహన దిగ్గజం హోండాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే, తాజాగా హోండా ప్రియులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. కంపెనీ తన పాపులర్ మోడల్ అయిన హోండా CB300F బైక్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ బైక్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది. హోండా మోటార్‌సైకిల్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ నుంచి CB300F, దాని ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను సైలెంట్‌గా తొలగించింది. సాధారణంగా ఏదైనా మోడల్‌ను అప్‌డేట్ చేయాలన్నా లేదా పూర్తిగా నిలిపివేయాలన్నా కంపెనీలు ఇలా చేస్తుంటాయి. అయితే, హోండా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో, ఈ బైక్ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసిందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

హోండా CB300F దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఇది E85 ఇంధనంపై పనిచేస్తుంది. అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో ఈ బైక్ నడుస్తుంది. పర్యావరణ హితమైన ఇంధనాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హోండా దీనిని తీసుకువచ్చింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇది ఒక గొప్ప ప్రయోగం అయినప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

ధర తగ్గినా పెరగని అమ్మకాలు

ఇటీవల 350సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్‌టీ తగ్గడంతో హోండా CB300F ధర భారీగా తగ్గింది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.55 లక్షల వద్ద ఉండేది. 300సీసీ సెగ్మెంట్‌లో ఇది అత్యంత చౌకైన బైక్ అయినప్పటికీ, అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇతర బ్రాండ్ల నుండి గట్టి పోటీ ఉండటం, ఫీచర్ల పరంగా యూత్‌ను ఆకట్టుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

హోండా తదుపరి ప్లాన్ ఏంటి?

ప్రస్తుతానికి హోండా తన 350సీసీ రేంజ్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. హోండా CB350, హైనెస్ CB350, CB350 RS వంటి మోడళ్లు మార్కెట్‌లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అందుకే తక్కువ అమ్మకాలు ఉన్న మోడల్స్‌ను పక్కన పెట్టి, లాభదాయకమైన ప్రీమియం బైక్ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని హోండా భావిస్తోంది. భవిష్యత్తులో CB300Fని సరికొత్త డిజైన్‌తో తీసుకువస్తారా లేదా అనేది వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story