Honda City Facelift : అదిరిపోయే లుక్, లగ్జరీ ఫీచర్లు.. కొత్త అవతారంలో మే 22న రాబోతున్న హోండా సిటీ
కొత్త అవతారంలో మే 22న రాబోతున్న హోండా సిటీ

Honda City Facelift : భారతీయ రోడ్లపై సెడాన్ కార్లంటే గుర్తొచ్చే మొదటి పేరు హోండా సిటీ. కొన్ని దశాబ్దాలుగా తనదైన క్లాస్, హుందాతనంతో దూసుకుపోతున్న ఈ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. హోండా కంపెనీ తన పాపులర్ మోడల్ హోండా సిటీకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేసింది. కేవలం లుక్ పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా భారీ మార్పులతో వస్తున్న ఈ కారు మే 22వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కొత్త అప్‌డేట్స్ సెడాన్ లవర్స్‌లో అప్పుడే భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.
హోండా ప్రిల్యూడ్ స్ఫూర్తితో స్పోర్టీ డిజైన్
ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌ను అంతర్జాతీయంగా పేరుగాంచిన హోండా ప్రిల్యూడ్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. దీనివల్ల కారు ఇప్పుడు మరింత వెడల్పుగా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్తగా రీడిజైన్ చేసిన గ్రిల్, సరికొత్త బంపర్ సెటప్ ఉండబోతున్నాయి. ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత షార్ప్‌గా ఉండటమే కాకుండా, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కారు వెనుక భాగంలో కూడా టెయిల్ ల్యాంప్స్, స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో మార్పులు చేశారు.
ఇంటీరియర్‌లో టెక్నాలజీ జాతర..
కారు లోపలికి అడుగుపెడితే, హోండా ఈసారి ఫీచర్లపై గట్టిగానే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. పెద్ద సైజు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, అప్‌డేటెడ్ కంట్రోల్స్ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ కార్లలో ఉండే 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి సదుపాయాలు ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో చేర్చారు. కారు క్యాబిన్ ఇప్పుడు మరింత విలాసవంతంగా ఉండటమే కాకుండా, యువతను ఆకర్షించేలా మోడ్రన్ ఫినిషింగ్ ఇవ్వనున్నారు.
నమ్మకమైన ఇంజన్.. మారేది లేదు
కారు స్టైల్, ఫీచర్లు మారినప్పటికీ, హోండా తన నమ్మకమైన ఇంజన్ ప్యాకేజీని మాత్రం అలాగే ఉంచింది. ఇందులో ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించనున్నారు. ఇది పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు హోండాకు ఉన్న ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కూడా మార్పు లేదు.. ఎప్పటిలాగే మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మొత్తానికి కొత్త టెక్నాలజీ, అదిరిపోయే లుక్, పాత నమ్మకాన్ని కలిపి హోండా సిటీని ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీగా మార్కెట్లోకి తెస్తోంది.

