Honda : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు రారాజుగా వెలిగిన జపనీస్ కార్ల దిగ్గజం హోండా మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవడానికి గట్టిగా ప్లాన్ చేసింది. ప్రీమియం కార్ల విభాగంలో తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు సరికొత్త అగ్రెసివ్ వ్యూహంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే దేశీయంగా ఎంతో క్రేజ్ ఉన్న తన ఐకానిక్ సెడాన్ కారు హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్లో లాంచ్ చేసింది. దీనితో పాటు అంతర్జాతీయంగా ఎంతో పాపులర్ అయిన తన సరికొత్త లగ్జరీ హైబ్రిడ్ ఎస్‌యూవీ హోండా ZR-Vని కూడా భారత్‌లో మొదటిసారిగా ప్రదర్శించింది. ఈ రెండు సరికొత్త మోడళ్లతో ప్రీమియం కార్ల మార్కెట్లో హోండా మళ్లీ ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత మార్కెట్లో గతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హోండా సీఆర్-వీ, హోండా సివిక్ కార్ల విక్రయాలు నిలిచిపోయిన తర్వాత.. ప్రీమియం సెగ్మెంట్లో హోండా బ్రాండ్ కాస్త వెనుకబడింది. కానీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ సరికొత్త ZR-V ఎస్‌యూవీతో కంపెనీ మళ్లీ రేసులోకి వచ్చింది. 4.6 మీటర్ల పొడవుతో ఉండే ఈ సరికొత్త 5-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీలో అధునాతన 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇంజన్‌ను అమర్చారు. ఈ సెగ్మెంట్లోనే ఇటువంటి పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న ఏకైక ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఇండియాలో ఇది హోండా కంపెనీకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనుంది. ఇది మార్కెట్లోకి వస్తే బీఎండబ్ల్యూ X1, స్కోడా కొడియాక్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

హోండా జెడ్ఆర్-వీ కారును కేవలం పవర్ కోసమే కాకుండా లగ్జరీని ఇష్టపడే వారి కోసం లగ్జరీ ఫీచర్లతో నింపేశారు. ఈ ఎస్‌యూవీలో ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించేలా ఒక పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్ భద్రత కోసం అధునాతన అడాస్ సేఫ్టీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పవర్డ్ సీట్లు, కారులో ఇరువైపులా నచ్చిన టెంపరేచర్ సెట్ చేసుకునేందుకు వీలుగా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యే పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఎన్నో హై-ఎండ్ ఫీచర్లను అందించారు. దీని ధరను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. లగ్జరీతో పాటు మైలేజ్ కూడా కావాలనుకునే ధనవంతులకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ కానుంది.

మిడిల్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ కస్టమర్ల ఫేవరెట్ కారు అయిన హోండా సిటీ సరికొత్త అప్‌డేట్స్‌తో మరింత స్టైలిష్‌గా మారిపోయింది. 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రారంభ ధరను రూ. 11.9 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు డిజైన్, లుక్స్ పరంగా కంపెనీ చాలా మార్పులు చేసింది. కారు ముందరి భాగంలో సరికొత్త హనీకోంబ్ డిజైన్ గ్రిల్, మరింత షార్ప్‌గా వెలిగే హెడ్‌ల్యాంప్ సెటప్, వెనుక భాగంలో స్పోర్టీ లుక్ ఇచ్చే సరికొత్త లైట్ బార్‌ను అమర్చారు. దీని బంపర్, సైడ్ ప్రొఫైల్‌లో ఇచ్చిన కొత్త అలాయ్ వీల్స్ ఈ సెడాన్ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చాయి.

కొత్త హోండా సిటీ లోపలి భాగంలో కస్టమర్ల కంఫర్ట్ కోసం ఒక పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కారును ఈజీగా పార్కింగ్ చేయడానికి, ఇరుకైన సందుల్లో నడపడానికి ఉపయోగపడే 360 డిగ్రీల కెమెరా, డ్రైవర్ సీటును నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకునేలా పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి మోడ్రన్ ఫీచర్లను జత చేశారు. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు అధునాతన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటరుకు ఏకంగా 27.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది. అంటే లగ్జరీ సెడాన్ కారులోనే బైక్ రేంజ్ మైలేజ్ అన్నమాట.

PolitEnt Media

PolitEnt Media

Next Story