Honda City Facelift vs Hyundai Verna: భారతదేశంలో ఎస్‌యూవీ కార్ల హవా నడుస్తున్నప్పటికీ, లగ్జరీ, క్లాసిక్ లుక్ ఇష్టపడే వారి కోసం మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో పోటీ హీటెక్కింది. మార్కెట్లో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న ఐకానిక్ సెడాన్ హోండా సిటీ సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాగా, దానికి గట్టి పోటీ ఇస్తూ హ్యుందాయ్ వెర్నా కూడా మోడ్రన్ అప్‌డేట్స్‌తో రంగంలోకి దిగింది. ఈ రెండు కార్లలోనూ లెవెల్-2 అడాస్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఉన్నాయి. మరి డిజైన్, పర్ఫార్మెన్స్, బడ్జెట్ పరంగా ఏ కారులో ఎక్కువ దమ్ముందో ఇప్పుడు చూద్దాం.

లుక్స్ పరంగా 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో కనెక్టెడ్ లైట్ బార్, మ్యాట్రిక్స్ మెష్ గ్రిల్, సరికొత్త బ్లేడ్-ఐ ఎల్ఈడీ లైటింగ్ ఇచ్చారు. ఈ కారు పొడవు 4,594 మిమీకి పెరగడం వల్ల రోడ్డుపై చాలా లగ్జరీగా కనిపిస్తుంది. మరోవైపు, హ్యుందాయ్ వెర్నా బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, మోడ్రన్ బంపర్స్, 16-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్‌తో అల్ట్రా-మోడ్రన్ లుక్‌ను కలిగి ఉంది. వెర్నా పొడవు (4,565 మిమీ) సిటీ కంటే కొంచెం తక్కువైనా, వెడల్పు, వీల్‌బేస్ పరంగా కేబిన్ లోపల అద్భుతమైన స్పేస్‌ను అందిస్తుంది.

కార్ల లోపల ఫీచర్ల విషయానికి వస్తే వర్నా కాస్త పైచేయి సాధించింది. హ్యుందాయ్ వెర్నాలో 10.25-ఇంచుల భారీ డ్యూయల్-స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్ + క్లస్టర్), 8-స్పీకర్ల బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లు ఉన్నాయి. దీని లెవెల్-2 అడాస్‌లో 20 అసిస్టెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదే సమయంలో హోండా సిటీలో కొత్త 10.1-ఇంచుల ఫ్లోటింగ్ స్క్రీన్, రిమోట్ ఏసీ ఆపరేషన్, 40% వేగంగా కూల్ చేసే అద్భుతమైన వెంటిలేటెడ్ సీట్లను అందించారు. సేఫ్టీ పరంగా సిటీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండగా, వెర్నా టాప్ ఎండ్‌లో 7వ సెంటర్ ఎయిర్‌బ్యాగ్‌ను ఇచ్చారు.

పర్ఫార్మెన్స్ పరంగా ఇరు కంపెనీలు భిన్నమైన వ్యూహాలు పాటించాయి. హోండా సిటీలో 119 bhp పవర్ ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 253 Nm టార్క్, లీటరుకు 25 కిమీ పైగా మైలేజ్ ఇచ్చే e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఇక హ్యుందాయ్ వెర్నాలో నార్మల్ 1.5L పెట్రోల్ (113 bhp) ఇంజిన్‌తో పాటు, స్పీడ్ ప్రియుల కోసం 157 bhp పవర్ ఇచ్చే రాకెట్ లాంటి 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ కావాలనుకునే వారికి హోండా సిటీ హైబ్రిడ్, విపరీతమైన పవర్, పికప్ కావాలనుకునే వారికి వెర్నా టర్బో బెస్ట్ ఛాయిస్.

ధరల విషయానికి వస్తే హ్యుందాయ్ వెర్నా ఎంట్రీ లెవెల్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. వర్నా ప్రారంభ ధర రూ.10.98 లక్షల నుంచి టాప్ మోడల్ ధర రూ.18.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కాగా, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా ఉండగా, హైటెక్ టెక్నాలజీతో కూడిన హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) టాప్ వేరియంట్ ధర రూ.20.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం కారు కావాలంటే వర్నా, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, అదిరిపోయే మైలేజ్ కావాలంటే హోండా సిటీ బెస్ట్ ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story