Honda Elevate : క్రెటాకు పోటీగా హోండా కొత్త ఎస్‌యూవీ.. స్పోర్టీ లుక్, ఆరెంజ్ యాక్సెంట్స్‌తో అదిరిపోద్ది
Honda Elevate : కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా కార్స్ ఇండియా రెడీ అయింది.

Honda Elevate : కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా కార్స్ ఇండియా రెడీ అయింది. హోండా తమ ప్రముఖ ఎస్‌యూవీ ఎలివేట్ టాప్-ఎండ్ వెర్షన్‌గా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ లుక్, అదనపు ప్రీమియం ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఏడీవీ ఎడిషన్ ధర రూ.15.29 లక్షల నుంచి రూ.16.66 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డ్యూయల్-టోన్ కలర్, బోల్డ్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కొత్త ఎడిషన్ ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.
హోండా కార్స్ ఇండియా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎలివేట్‌లో టాప్-ఎండ్ వెర్షన్‌గా ADV ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్‌తో సమానమైన ఇంజిన్, మెకానికల్ భాగాలను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్, స్టైలింగ్‌లో చాలా మార్పులు చేసింది. ఈ ఎడిషన్ ధర రూ.15.29 లక్షల నుంచి రూ.16.66 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వేరియంట్ల విషయానికి వస్తే.. సింగిల్-టోన్ మ్యాన్యువల్ (MT) ధర రూ.15.29 లక్షలు, డ్యూయల్-టోన్ మ్యాన్యువల్ (MT) ధర రూ.15.49 లక్షలు, సింగిల్-టోన్ ఆటోమేటిక్ (CVT) ధర రూ.16.46 లక్షలు, డ్యూయల్-టోన్ ఆటోమేటిక్ (CVT) ధర రూ.16.66 లక్షలు.
హోండా ఈ కారుపై మూడు సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. దీనిని 10 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కొత్త ఎలివేట్ ఏడీవీ ఎడిషన్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ అప్‌డేట్‌లను పొందింది, ముఖ్యంగా ఆరెంజ్ రంగు హైలైట్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. బ్లాక్ అల్లాయ్ వీల్స్‌పై ఆరెంజ్ యాక్సెంట్‌లు, కొత్త ఆల్ఫా-బోల్డ్ ప్లస్ ఫ్రంట్ గ్రిల్ బ్లాక్ బోర్డర్‌తో, బోనెట్‌పై ఆరెంజ్ డీకాల్స్ ఈ కారును ప్రత్యేకంగా నిలుపుతాయి. రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, ఓఆర్‌విఎంలు, షార్క్ ఫిన్ యాంటెన్నా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడ్డాయి. ఫెండర్లపై ADV బ్యాడ్జింగ్, రియర్ స్కిడ్ ప్లేట్ దగ్గర ఆరెంజ్ టచ్ ఇచ్చారు.
డ్యూయల్-టోన్ వేరియంట్లలో బ్లాక్ C-పిల్లర్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్ లభిస్తాయి. ఇది మెటియోరాయిడ్ గ్రే మెటాలి, లూనార్ సిల్వర్ మెటాలిక్ అనే రెండు ఎక్స్‌టీరియర్ కలర్లో అందుబాటులో ఉంది. ఏడీవీ ఎడిషన్ లోపలి భాగం కూడా బయటి డిజైన్‌కు సరిపోయేలా బ్లాక్, ఆరెంజ్ థీమ్‌లో ఉంది. సీట్లు, డోర్ ట్రిమ్, గేర్ షిఫ్టర్‌పై ఆరెంజ్ కలర్ డిటైలింగ్ ఇచ్చారు. బ్లాక్ సీట్లపై ఆరెంజ్ స్టిచ్చింగ్, ADV లోగో ఎంబోజ్ చేశారు. ఏసీ నాబ్స్, గేర్ నాబ్ మోల్డింగ్‌పై కూడా ఆరెంజ్ టచ్ ఉంది. సీట్ బెల్ట్ మెటల్ పార్ట్స్ కూడా ఆరెంజ్ రంగులో ఉన్నాయి. రూఫ్ లైనింగ్, సన్‌వైజర్, పిల్లర్లు బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. దీనితో పాటు క్యాబిన్‌కు మరింత ఆకర్షణ తీసుకురావడానికి ADV-ప్రత్యేకమైన ఇల్యూమినేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ గార్నిష్ కూడా ఇందులో అందించారు.

