Honda Elevate: జపాన్ కార్ల దిగ్గజం హోండా త్వరలో తమ పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఎలివేట్ రాకతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత తీవ్రం కానుంది. కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన టెస్టింగ్ దశ ఇప్పటికే పూర్తయింది. ఈ మోడల్‌ను పలు దేశాలతో పాటు భారత్‌లో కూడా రోడ్లపై టెస్ట్ చేస్తుండగా చాలాసార్లు కెమెరాలకు చిక్కింది. ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఎస్‌యూవీ సెప్టెంబర్ ఆఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ మోడల్ కాబట్టి పాత డిజైన్‌ను పూర్తిగా మార్చకుండా, దానికి కొన్ని ఆధునిక హంగులు అద్ది మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకురానున్నారు.

డిజైన్, ఇంటీరియర్స్‌లో మార్పులు

కొత్త హోండా ఎలివేట్ బాక్సీ ఆకారాన్ని అలాగే కొనసాగిస్తూనే, ముందు, వెనుక భాగాల్లో కీలక మార్పులు చేయనున్నారు. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, ఫ్రంట్ బంపర్‌తో పాటు హెడ్‌లైట్లలో కూడా స్వల్ప మార్పులు ఉండనున్నాయి. అయితే, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ పాత మోడల్ లాగే వస్తాయి. కారు పక్కభాగంలో కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంటీరియర్‌ విషయానికొస్తే డాష్‌బోర్డ్ డిజైన్ పాతదిగానే ఉన్నా, క్యాబిన్‌కు సరికొత్త రంగులు వేసి మోడ్రన్ లుక్ ఇవ్వనున్నారు. ఈ కొత్త ఎలివేట్‌లో వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా లాంటి అత్యాధునిక ఫీచర్లు రావడం దాదాపు ఖాయం. ప్రస్తుతం ఉన్న 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు అలాగే కొనసాగుతాయి.

ఇంజిన్ పవర్‌లో నో చేంజ్

హోండా ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు చేయడం లేదు. పాత 1.5 లీటర్, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తోనే రానుంది. ఇది 121 బీహెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ విషయంలో 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాల విషయంలో హోండా ఎక్కడా రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కెమెరా ఆధారిత 'హోండా సెన్సింగ్' టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లాంటి భారీ మోడళ్లకు హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఫీచర్లు పెరిగినప్పటికీ పాత మోడల్ ధరతోనే దీన్ని లాంచ్ చేసే యోచనలో హోండా సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story