Elevate vs Duster: రేసులో ఏ ఎస్యూవీ బెస్ట్? కొనేముందు ఈ తేడాలు చూడండి
ఈ తేడాలు చూడండి

Elevate vs Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. హోండా ఎలివేట్‌కు గట్టి పోటీ ఇస్తూ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రెండు కార్ల ప్రారంభ ధరలు దాదాపు దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంజిన్ కెపాసిటీ, హైటెక్ ఫీచర్ల విషయంలో ఏది బెస్ట్ అనే వివరాలు తెలుసుకుందాం.
ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్‌లో అసలు పోటీ
హోండా ఎలివేట్ విశ్వసనీయమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 121 పిఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్, సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 15.31 కిలోమీటర్లు, సివిటి వేరియంట్ 16.92 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. నగర ప్రయాణాలకు, సులువైన డ్రైవింగ్‌కు ఇది చక్కగా సరిపోతుంది.
మరోవైపు కొత్త రెనాల్ట్ డస్టర్ ఇంజిన్ విషయంలో విభిన్న ఆప్షన్లతో దూసుకొచ్చింది. 1.8-లీటర్ పెట్రోల్ ఈ-టెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు 1.4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ట్రాఫిక్ పరిస్థితుల్లో దీనిని కొంతసేపు నేరుగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడిపే వీలుంది. ఇది కాకుండా, టర్బో టీసీఈ 160 ఇంజిన్ వేరియంట్ ఏకంగా 153 పిఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. రఫ్ రోడ్లపై ప్రయాణించడానికి, శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునేవారికి డస్టర్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
ఫీచర్లు, టెక్నాలజీలో ముందంజ ఎవరిది?
హోండా ఎలివేట్‌లో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 17-ఇంచీల వీల్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఇచ్చారు. పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పిఎమ్ 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25-ఇంచీల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి అవసరమైన అన్ని సౌకర్యాలనూ కల్పించారు.
టెక్నాలజీ, మోడ్రన్ ఫీచర్ల విషయంలో రెనాల్ట్ డస్టర్ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, ఇన్-బిల్ట్ గూగుల్ సిస్టమ్, 700 లీటర్ల భారీ బూట్ స్పేస్, ఎలక్ట్రిక్ పవర్ టెయిల్‌గేట్ కలవు. వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 35 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఇచ్చారు. 212 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లలో కూడా ఈ కారు నడపడం చాలా సులభం.
ధరల వ్యత్యాసం, ఏది బెస్ట్
హోండా ఎలివేట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.60 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ.16.67 లక్షల వరకు ఉంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.18.49 లక్షల వరకు ఉంది. డస్టర్ ప్రారంభ ధర ఎలివేట్ కంటే దాదాపు రూ.1.11 లక్షలు తక్కువగా ఉండటం విశేషం.

