Honda: హోండా కొత్త ఎస్‌యూవీలో సొంత ఇంజిన్ లేదా? అసలు నిజం బయటపెట్టిన కంపెనీ
అసలు నిజం బయటపెట్టిన కంపెనీ

Honda: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ రూపకల్పనలో బిజీగా ఉంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో అంటే 2028 నాటికి ఈ సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వాహనంలో హోండా తన స్వంత ఇంజిన్‌ను వాడకుండా, బయటి సంస్థ నుంచి పవర్‌ట్రైన్‌ను సేకరించాలని చూస్తోంది. ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల నుంచి మారుతున్న అభిరుచులకు తగినట్లుగా సరికొత్త టెక్నాలజీతో ఈ కారును తీసుకురావాలని కంపెనీ ప్లాన్ వేసింది.
హార్స్ పవర్‌ట్రైన్ నుంచి కొత్త 1.2 లీటర్ ఇంజిన్
తాజా సమాచారం ప్రకారం హోండా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రాజెక్ట్ కోసం హార్స్ పవర్‌ట్రైన్ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఈ కంపెనీ నుంచి 1.2 లీటర్ కొత్త ఇంజిన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఇంజిన్ కేవలం పెట్రోల్ వెర్షనే కాకుండా హైబ్రిడ్, సీఎన్‌జీ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి రానుంది. తద్వారా ఒకే మోడల్‌లో కస్టమర్లు తమకు నచ్చిన ఫ్యూయల్ ఆప్షన్‌ను ఎంచుకునే సౌలభ్యం లభిస్తుంది.
రెనాల్ట్ డస్టర్‌లోనూ ఇదే టెక్నాలజీ
పెట్రోల్ అలాగే హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌లను తయారు చేయడంలో హార్స్ పవర్‌ట్రైన్ కంపెనీకి మంచి పేరుంది. ఇది రెనాల్ట్ గ్రూప్, గీలీ జాయింట్ వెంచర్ సంస్థ కాగా సౌదీ ఆరామ్కో కూడా ఇందులో షేర్‌హోల్డర్‌గా ఉంది. భారత్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేసి లోకల్‌గా ఇంజిన్‌లను తయారు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. తద్వారా కార్ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా రాబోయే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కారులో కూడా ఇదే కంపెనీకి చెందిన ఇంజిన్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది.
హోండా కొత్త ఇంజిన్‌ను ఎందుకు వెతుకుతోంది?
ప్రస్తుతం హోండా దగ్గర 1.2 లీటర్, 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే కఠినమైన ఉద్గార నిబంధనలు, ఇంధన సామర్థ్య మార్పులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ పాత ఇంజిన్లను అప్‌డేట్ చేస్తోంది. మరోవైపు సీఎన్‌జీ, హైబ్రిడ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి సరికొత్త ప్లాట్‌ఫాం అవసరం ఏర్పడింది. ఈ టెక్నాలజీని పూర్తిగా సొంతంగా అభివృద్ధి చేయాలంటే భారీ పెట్టుబడితో పాటు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రెడీమేడ్ మల్టీ-ఫ్యూయల్ ఇంజిన్ ఫ్యామిలీని ఎంచుకోవాలని హోండా ఆలోచిస్తోంది.
2028 నాటికి ఎంట్రీ.. ఏయే కార్లతో పోటీ పడనుంది?
ఇండోనేషియాలో తయారవుతున్న కొత్త తరం డబ్ల్యూఆర్-వీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త ఎస్‌యూవీని రూపొందించనున్నారు. ఈ వాహన డిజైన్, ఇంజనీరింగ్ పనులలో టాటా టెక్నాలజీస్ సహకరిస్తుండగా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బాధ్యతలను టీసీఎస్ చూడనుంది. మార్కెట్లోకి వచ్చాక హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా వంటి పాపులర్ ఎస్‌యూవీలతో ఈ కారు గట్టి పోటీ పడనుంది. హోండా అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత స్పష్టంగా తెలియనున్నాయి.

