జనవరి అమ్మకాల్లో హోండా సరికొత్త రికార్డు

Honda : భారత టూ-వీలర్ మార్కెట్‌లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 జనవరి నెలలో ఈ జపనీస్ దిగ్గజం అసాధారణమైన అమ్మకాలను నమోదు చేసింది. దేశంలోనే రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న హోండా, గత నెలలో ఏకంగా 5,19,579 యూనిట్లను విక్రయించింది. 2025 జనవరితో (4,02,977 యూనిట్లు) పోలిస్తే ఇది దాదాపు 29 శాతం వృద్ధి. ముఖ్యంగా యాక్టివా స్కూటర్లు, షైన్ బైక్‌ల వెల్లువతో హోండా షోరూమ్‌లన్నీ కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి.

హోండా విజయంలో సింహభాగం ఎప్పటిలాగే యాక్టివాదే. జనవరి నెలలో ఏకంగా 2,71,924 మంది కస్టమర్లు యాక్టివాను తమ ఇంటికి తీసుకెళ్లారు. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాల్లో 63 శాతం పెరుగుదల కనిపించడం విశేషం. భారతీయ కుటుంబాలకు యాక్టివా ఇప్పటికీ నంబర్ వన్ ఛాయిస్ అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్ హవా కొనసాగుతోంది.

బైక్ విభాగంలో షైన్ 125 హోండాకు వెన్నెముకగా నిలిచింది. గత నెలలో 1,35,076 యూనిట్లు అమ్ముడై, కంపెనీలో టాప్ సెల్లింగ్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 11 శాతం స్వల్పంగా తగ్గాయి. మరోవైపు, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో షైన్ 100 అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఏకంగా 55 శాతం వృద్ధితో 26,148 యూనిట్ల విక్రయాలను సాధించింది. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే బైక్ కావడంతో దీనికి ఆదరణ పెరుగుతోంది.

యువత, ఉద్యోగుల ఫేవరెట్ సీబీ యూనికార్న్ 160 కూడా 35,710 యూనిట్ల అమ్మకాలతో తన సత్తా చాటింది. ఇక మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో హోండాకు అసలైన కిక్ ఇచ్చింది సీబీ 350. ఏకంగా 200 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 5,500 యూనిట్లు అమ్ముడైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇస్తూ ఈ బైక్ దూసుకుపోతోంది. అయితే, డియో స్కూటర్ అమ్మకాలు మాత్రం 44 శాతం పడిపోయి 13,855 యూనిట్లకు పరిమితమవ్వడం గమనార్హం.

హోండా లివో 4,433 యూనిట్లు, సీబీ 125 హార్నెట్ 8,752 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఎస్పీ 160 అమ్మకాలు కొంత తగ్గి 2,474 యూనిట్ల వద్ద నిలిచాయి. హైనెస్ సీబీ 350 కూడా 2,302 యూనిట్ల అమ్మకాలతో నిలకడగా ఉంది. మొత్తానికి 2026 సంవత్సరాన్ని హోండా అదిరిపోయే రీతిలో ప్రారంభించింది. యాక్టివా, షైన్ బ్రాండ్‌ల నమ్మకమే హోండాను అగ్రపథంలో నిలబెడుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story