Honda: రాయల్ ఎన్ఫీల్డ్కు చెక్ పెట్టేందుకు హోండా మాస్టర్ ప్లాన్.. అప్‌డేటెడ్ 350సీసీ బైకులు విడుదల
అప్‌డేటెడ్ 350సీసీ బైకులు విడుదల

Honda: భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తన అత్యంత ప్రజాదరణ పొందిన 350సీసీ బైక్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా సీబీ350, సీబీ350ఆర్‌ఎస్, సీబీ350సీ మోడళ్లలో సరికొత్త వేరియంట్లు, ఆకర్షణీయమైన స్టైలింగ్ ఆప్షన్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిళ్లను దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనున్నారు. ఈ కొత్త బైకుల ఎక్స్ షోరూమ్ ధరలు రూ.1,95,200 నుంచి రూ.2,04,700 మధ్యలో ఉన్నాయి.
క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం హోండా సీబీ350 బైక్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,95,200 ఉండగా, డీఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ.1,97,900, టాప్-ఎండ్ క్రోమ్ వేరియంట్ ధర రూ.1,99,900గా నిర్ణయించారు. ఈ బైక్‌లో ఆకర్షణీయమైన రౌండ్ హెడ్‌ల్యాంప్, క్లాసిక్ ఫ్యూయెల్ ట్యాంక్, బాడీ నిండా క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం ద్వారా మరింత అందంగా తీర్చిదిద్దారు. అలాగే కొత్త మోడళ్లలో అదనంగా బ్రౌన్ సీట్ ఆప్షన్‌ను కూడా జత చేశారు.
స్పోర్టివ్ లుక్‌లో హోండా సీబీ350ఆర్‌ఎస్
యూత్ అండ్ స్పోర్టివ్ లుక్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని హోండా సీబీ350ఆర్‌ఎస్ బైక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చారు. ఇది స్టాండర్డ్ (రూ.1,99,900) మరియు డీఎల్‌ఎక్స్ (రూ.2,02,500) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డార్క్ ఫినిషింగ్, బ్లాక్ ఎగ్జాస్ట్, షార్ట్ రియర్ సెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు సాంప్రదాయ డిజైన్‌ను కోరుకునే వారి కోసం ప్రవేశపెట్టిన సీబీ350సీ మోడల్ స్టాండర్డ్, డీఎల్‌ఎక్స్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ.2,00,300 నుంచి రూ.2,04,700 వరకు ఉన్నాయి. ఇందులో పెద్ద మడ్‌గార్డ్స్, ట్యాంక్ నీ ప్యాడ్స్, స్ప్లిట్ బ్రౌన్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పవర్ఫుల్ ఇంజిన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు
ఈ మూడు బైకులలోనూ ఒకే రకమైన 348.6సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 21.07 PS పవర్, 29.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ సపోర్ట్ లభిస్తుంది. ఇక రైడర్ భద్రత, సౌకర్యం కోసం ఇందులో హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, డ్యూయల్-చానెల్ ఏబీఎస్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇచ్చారు. అలాగే ఎల్ఈడీ లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఇవ్వడం ద్వారా ఈ బైక్‌ను మరింత పటిష్టంగా తయారు చేశారు.

