భారత్ కోసం 3 కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు సిద్ధం

Honda : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గత కొంతకాలంగా హోండా కంపెనీ వేగం తగ్గింది. ప్రస్తుతం కేవలం సిటీ, ఎమేజ్, ఎలివేట్ మోడళ్లతోనే కాలం గడుపుతోంది. అయితే, పెరుగుతున్న ఎస్‌యూవీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా ఇప్పుడు తన రూటు మార్చుతోంది. రాబోయే కాలంలో మూడు సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మెరుగైన మైలేజీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో హోండా తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ప్లాన్ చేస్తోంది.

1. హోండా ఎలివేట్ హైబ్రిడ్:

హోండా మొదట ఎలివేట్ ఈవీ (ఎలక్ట్రిక్) వెర్షన్‌ను తీసుకురావాలని అనుకుంది. కానీ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను బట్టి తన ఫోకస్‌ను హైబ్రిడ్ వైపు మళ్లించింది. త్వరలో రాబోయే ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఆధారంగా ఈ హైబ్రిడ్ వెర్షన్ ఉండబోతోంది. ప్రస్తుతం హోండా సిటీ హైబ్రిడ్‌లో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌నే దీనిలోనూ వాడే అవకాశం ఉంది. హోండా కొత్తగా మరింత తేలికైన, తక్కువ ధరకు లభించే హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది.

2. హోండా జెడ్ఆర్-వి (ZR-V):

హోండా నుంచి రాబోతున్న మరో క్రేజీ మోడల్ ZR-V హైబ్రిడ్. ఇది 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రీమియం సెగ్మెంట్ కారుగా ఉండబోతోంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, ఏడీఏఎస్, 12-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి హైటెక్ ఫీచర్లు ఉండనున్నాయి. దీనిలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, ఇది సిటీ ట్రాఫిక్‌లో ఈవీ మోడ్‌లో నడిచే సదుపాయాన్ని ఇస్తుంది.

3. సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ:

హోండా ఇప్పుడు PF2 అనే సరికొత్త గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక పవర్‌ఫుల్ 7-సీటర్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇది భారత్‌లోనే తయారవుతుంది కాబట్టి ధర కూడా అందుబాటులోనే ఉండవచ్చు. ఇది నేరుగా హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా XUV700 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి, పవర్, మైలేజీ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక కానుంది.

హోండా తీసుకువస్తున్న ఈ మార్పులు భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. కేవలం సెడాన్ కార్లకే పరిమితం కాకుండా, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కూడా తన సత్తా చాటాలని హోండా గట్టిగా నిశ్చయించుకుంది. ఈ మూడు హైబ్రిడ్ కార్లు వస్తే హోండా సేల్స్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story