Honda : భారత మార్కెట్లో హోండా దూకుడు.. రాబోయే మూడేళ్లలో 5 కొత్త మోడల్స్ లాంచ్
రాబోయే మూడేళ్లలో 5 కొత్త మోడల్స్ లాంచ్

Honda : హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ఒక భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది. పెరుగుతున్న ఎస్‌యూవీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ కేవలం పెట్రోల్ మోడల్స్ మాత్రమే కాకుండా.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో హోండా నుంచి అదిరిపోయే కార్లు మన ముందుకు రానున్నాయి. వీటిలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మోడల్స్ నుంచి, లగ్జరీ స్పోర్ట్స్ కార్ల వరకు అన్నీ ఉన్నాయి.
హోండా ఎలివేట్ ఈవీ
హోండా నుంచి రాబోతున్న అత్యంత ముఖ్యమైన కారు ఎలివేట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీనికి ప్రస్తుతం ఏస్ (ACE) అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారు 60-70 kWh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450-500 కి.మీ రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
హైబ్రిడ్ కార్ల హంగామా
హోండా తన పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్‌ను 2026 ద్వితీయార్థంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో హోండా సిటీలో ఉన్నటువంటి 1.5 లీటర్ అట్కిన్సన్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. దీనివల్ల కారు మైలేజీ లీటరుకు సుమారు 25-28 కి.మీ వరకు ఉండవచ్చు. అలాగే, 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా హోండా అభివృద్ధి చేస్తోంది. ఇది కంపెనీ సరికొత్త PF2 ప్లాట్‌ఫామ్ మీద రూపొందుతోంది. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి పెద్ద కార్లకు సవాల్ విసరనుంది.
గ్లోబల్ మోడల్స్ ఎంట్రీ
భారత్ లో బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి హోండా తన గ్లోబల్ మోడల్స్‌ను కూడా తీసుకువస్తోంది. Honda ZR-V అనే ప్రీమియం హైబ్రిడ్ ఎస్‌యూవీని 2026 చివరి నాటికి ఆశించవచ్చు. ఇందులో 2.0 లీటర్ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోండా తన ఐకానిక్ స్పోర్ట్స్ కార్ ప్రిల్యూడ్ను కూడా భారత్‌కు తీసుకువచ్చే యోచనలో ఉంది. ఇది 2-డోర్ స్పోర్ట్స్ కూపే, ఇందులో 200 bhp కంటే ఎక్కువ పవర్ ఇచ్చే హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది.
6వ జనరేషన్ హోండా సిటీ
సెడాన్ ప్రియుల కోసం హోండా తన లెజెండరీ కారు సిటీ 6వ జనరేషన్ మోడల్‌ను 2028 నాటికి లాంచ్ చేయనుంది. ఇది కూడా కొత్త PF2 ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మునుపటి కంటే 90 కిలోల బరువు తక్కువగా, మరింత దృఢంగా ఉంటుంది. దీనివల్ల కారు మైలేజీ, పర్ఫార్మెన్స్ అద్భుతంగా మెరుగుపడతాయి. లోపలి భాగంలో లగ్జరీ ఇంటీరియర్స్, అత్యాధునిక ADAS ఫీచర్లు ఉండనున్నాయి.

