బెస్ట్ సెల్లింగ్ టూవీలర్‎గా యాక్టివా, షైన్

Honda : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాకు జూన్ 2025లో అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది జూన్ 2024తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 19.43% తగ్గాయి. అంతేకాదు, మే 2025తో పోలిస్తే కూడా జూన్‌లో అమ్మకాలు 6.8% తగ్గాయి. అయినా కూడా యాక్టివా, షైన్ బైక్ హోండా కంపెనీని నిలబెట్టాయి. జూన్ 2025లో హోండా యాక్టివా స్కూటర్లు మొత్తం 1,83,265 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే అమ్మకాలు 21.47% తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికీ హోండాలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా ఉంది. హోండా అమ్మకాల్లో యాక్టివా వాటా 47.13%. ఇది టీవీఎస్ జూపిటర్ వంటి పోటీదారుల కంటే చాలా ముందుంది.

హోండా షైన్ 125, SP125 బైక్‌ల మొత్తం అమ్మకాలు 1,34,817 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కంటే 3.42% తక్కువగానే ఉన్నా, హోండా మొత్తం అమ్మకాల్లో ఈ బైక్‌ల వాటా 35% కంటే ఎక్కువ. హోండా షైన్ సిరీస్, యాక్టివా కలిపి హోండా మొత్తం అమ్మకాల్లో 82% వాటాను కలిగి ఉన్నాయి. యాక్టివా, షైన్ మినహా మిగతా మోడల్స్ అమ్మకాలు బాగా తగ్గాయి. డియో 24,278 యూనిట్లు అమ్ముడయ్యాయి, 25.49% తగ్గింది. షైన్ 100.. 8,401 యూనిట్లు అమ్ముడయ్యాయి, 63.61% తగ్గింది. లివో..3,272 యూనిట్లు అమ్ముడయ్యాయి, 53.51% తగ్గింది. SP160.. 2,380 యూనిట్లు అమ్ముడయ్యాయి, 66.56% తగ్గింది. హార్నెట్ 2.0.. 923 యూనిట్లు అమ్ముడయ్యాయి, 55.63% తగ్గింది.

అమ్మకాలు తగ్గినప్పటికీ కొన్ని మోడల్స్ మంచి పర్ఫామెన్స్ కనబరిచాయి. CB350 బైక్ అమ్మకాలు జూన్ 2025లో 2,361 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కంటే 103.36% ఎక్కువ. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో కస్టమర్ల ఆసక్తి పెరుగుతోందని చూపిస్తుంది. నవంబర్ 2024లో లాంచ్ అయిన యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జూన్‌లో 772 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి పోటీ ఇస్తోంది.

ఏప్రిల్ నుండి జూన్ 2025 వరకు హోండా మొత్తం అమ్మకాలు 12,28,993 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది ఇదే కాలంలో ఉన్న 14,14,232 యూనిట్ల కంటే 13.10% తక్కువ. అయితే, షైన్ 125, SP125 బైక్‌ల అమ్మకాలు ఈ కాలంలో 11.54% పెరిగాయి. యాక్టివా, షైన్ హోండాను నిలబెట్టినా, డియో, లివో వంటి మోడల్స్ అమ్మకాలు తగ్గడం ఆందోళన కలిగించే విషయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story