What is ADAS : స్టీరింగ్ మీదే ఉంటుంది కానీ.. కారు మాత్రం దానంతట అదే తిరుగుతుంది.. అదే ఏడాస్ స్పెషల్
అదే ఏడాస్ స్పెషల్

What is ADAS : ప్రస్తుత కాలంలో కార్లు కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లే వాహనాలు మాత్రమే కాదు.. అవి అత్యంత తెలివైన మెషిన్లుగా మారిపోయాయి. ఒకప్పుడు కార్లలో భద్రత అంటే కేవలం బాడీ దృఢత్వం, ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సాంకేతికత పుణ్యమా అని ADAS (Advanced Driver Assistance Systems) వంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ ఏడాస్ అంటే ఏమిటి? ఇది కారులో ఎలా పనిచేస్తుంది? లెవల్-1 కి, లెవల్-2 కి ఉన్న తేడాలేంటో వివరంగా తెలుసుకుందాం.
ADAS ఎలా పనిచేస్తుంది?
ఏడాస్ ప్రధానంగా మూడు కీలక దశల్లో పనిచేస్తుంది. అవి: సెన్సార్లు-కెమెరాలు, డేటా ప్రాసెసింగ్ ,యాక్షన్.
* సెన్సార్లు, కెమెరాలు: కారు చుట్టూ అమర్చిన కెమెరాలు రోడ్డు మీద ఉన్న గుర్తులు, ట్రాఫిక్ సిగ్నల్స్, మనుషులను గుర్తిస్తాయి. రాడార్ ముందు వెళ్తున్న వాహనానికి ఉన్న దూరాన్ని లెక్కిస్తుంది. LiDAR (లైడార్) రోడ్డును 3D మ్యాప్‌లా చిత్రీకరిస్తుంది. ఇక Ultrasonic Sensors కారు పార్కింగ్ చేసేటప్పుడు అడ్డుగా ఉన్న వాటిని గుర్తిస్తాయి.
* డేటా ప్రాసెసింగ్ & AI: సెన్సార్లు పంపిన డేటాను కారులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మెదడులాగా ప్రాసెస్ చేస్తుంది. ఏదైనా ముప్పు ఉందని అనిపిస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటుంది.
* హెచ్చరికలు, యాక్షన్: ప్రమాదం జరిగేలా ఉంటే మొదట బీప్ శబ్దంతో హెచ్చరిస్తుంది. డ్రైవర్ స్పందించకపోతే, సిస్టమే స్వయంగా బ్రేకులు వేయడం లేదా స్టీరింగ్‌ను నియంత్రించడం చేస్తుంది.
లెవల్-1 ఏడాస్ అంటే ఏమిటి?
దీనిని బేసిక్ అసిస్టెన్స్ అని పిలుస్తారు. ఇందులో కారు కొన్ని సందర్భాల్లో మాత్రమే డ్రైవర్‌కు సహాయం చేస్తుంది. ఉదాహరణకు Adaptive Cruise Control. ఇది ముందున్న కారు వేగానికి అనుగుణంగా మన కారు స్పీడ్‌ను తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. అయితే, స్టీరింగ్ మీద మాత్రం డ్రైవర్ కచ్చితంగా చేయి ఉంచాల్సి ఉంటుంది. దీన్ని హ్యాండ్స్-ఆన్ అసిస్ట్ అంటారు.
లెవల్-2 ఏడాస్ అంటే ఏమిటి?
దీన్ని పార్షియల్ ఆటోమేషన్ అంటారు. అంటే కారు పాక్షికంగా తనను తాను నియంత్రించుకోగలదు. ఇందులో Lane Keep Assist (లైన్ దాటకుండా చూసుకోవడం), Auto Parking, Automatic Braking వంటి ఫీచర్లు ఉంటాయి. కారు స్వయంగా స్టీరింగ్ తిప్పగలదు, బ్రేకులు వేయగలదు. అయితే, ఇది డ్రైవర్ లేకపోయినా నడుస్తుంది అని కాదు.. డ్రైవర్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. దీన్ని హ్యాండ్స్-ఆఫ్ టెక్నాలజీ అన్నా, డ్రైవర్ దృష్టి రోడ్డు మీద ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం ఇండియాలో ఎక్స్‌యూవీ 700, టాటా హారియర్, సఫారీ, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లలో కూడా లెవల్-2 ఏడాస్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

