Car Platform: ఒకే ప్లాట్‌ఫారమ్ మీద వేర్వేరు కార్ల తయారీ.. ఆటోమొబైల్ కంపెనీల మాస్టర్ మైండ్ గేమ్
మాస్టర్ మైండ్ గేమ్

Car Platform: రోడ్డు మీద వెళ్తున్న వేర్వేరు కంపెనీల కార్లను చూసినప్పుడు ప్రతీ కారును పూర్తిగా కొత్త స్టైల్లో, వేరే రకంగా డిజైన్ చేసి ఉంటారని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ ఆటోమొబైల్ రంగంలో అసలు కథ వేరేలా ఉంటుంది. కార్ల తయారీదారులు విడివిడిగా ప్రతి మోడల్ కోసం మొదటి నుంచి అన్నీ తయారు చేయరు. బదులుగా, వారు ఒక స్ట్రాంగ్ బేస్‌ను లేదా ఇంజనీరింగ్ ఫ్రేమ్ వర్క్‌ను సిద్ధం చేస్తారు, దానిపై అవసరానికి తగినట్లుగా వేర్వేరు కార్లను తయారు చేస్తారు. ఈ ప్రాథమిక బేస్‌నే కార్ ప్లాట్‌ఫారమ్ అని పిలుస్తారు. దీనివల్ల కంపెనీలకు కోట్ల కొద్దీ డబ్బులు, సమయం భారీగా ఆదా అవుతాయి.
ఈ కార్ ప్లాట్‌ఫారమ్‌ను సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఇంటి నిర్మాణం లాగా భావించవచ్చు. ఇంటికి సంబంధించిన పునాది, మెయిన్ స్ట్రక్చర్ ఒకేలా ఉండి, పైనున్న గదులు, ఇంటీరియర్ డిజైన్‌ను అవసరానికి తగ్గట్టు మార్చుకున్నట్లే.. కార్లలో కూడా వీల్ బేస్, సస్పెన్షన్ అమరిక, ఇంజిన్ లేదా మోటార్ ఫిట్ చేసే స్థలం వంటి ముఖ్యమైన బేసిక్ స్ట్రక్చర్‌ను ఒకేలా ఉంచుతారు. ఆ తర్వాత దీనిని చిన్నదిగా లేదా పెద్దదిగా మార్చుకుంటూ చిన్న ఎస్‌యూవీలు, పెద్ద ఎస్‌యూవీలు లేదా సెడాన్ కార్లను తయారు చేస్తారు. బయటికి చూడటానికి కార్ల డిజైన్లు పూర్తిగా భిన్నంగా కనిపించినప్పటికీ, లోపలి కొన్ని విడిభాగాలు లేదా టెక్నాలజీ మాత్రం ఒకేలా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ కార్ల కంపెనీలు ఈ వ్యూహాన్నే పాటిస్తున్నాయి. ఒక కొత్త కారును పూర్తిగా మొదటి నుంచి డిజైన్ చేసి మార్కెట్లోకి తేవాలంటే రీసెర్చ్, టెస్టింగ్, ప్రొడక్షన్ కోసం వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఒకసారి ప్లాట్‌ఫారమ్ తయారు చేశాక, అదే బేస్‌ను అనేక మోడళ్ల తయారీకి వాడుకోవడం ద్వారా ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. దీనివల్ల విడిభాగాల కొనుగోలు సులభం కావడంతో పాటు ఫ్యాక్టరీలో ఉత్పత్తి వేగం పుంజుకుంటుంది. కేవలం కంపెనీలకే కాకుండా, ఈ టెక్నాలజీ వల్ల కొత్త కార్లను మరింత తక్కువ ఖర్చుతో, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో త్వరగా మార్కెట్లోకి తీసుకురావడానికి కస్టమర్లకు కూడా పరోక్షంగా మేలు జరుగుతుంది.
అయితే ఒకే ప్లాట్‌ఫారమ్‌ను వాడినంత మాత్రాన అన్ని కార్లు ఒకేలా నడుస్తాయని అనుకోవడం పొరబాటే. కంపెనీలు వాటి బాడీ షేప్, ఇంజిన్ పవర్, బ్యాటరీ కెపాసిటీ, సస్పెన్షన్ ట్యూనింగ్, ఇంటీరియర్ ఫీచర్లను పూర్తిగా మార్చేస్తుంటాయి. అందుకే ఒకే బేస్‌పై తయారైన రెండు వేర్వేరు కార్ల డ్రైవింగ్ అనుభూతి రోడ్డు మీద పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా నేటి ఆధునిక కాలంలో కేవలం లోహపు బేస్ మాత్రమే కాకుండా సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఇమిడ్చేలా కంపెనీలు మారుస్తున్నాయి. భవిష్యత్తులో ఇదే ప్లాట్‌ఫారమ్‌లపై పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు అన్నీ ఒకే బేస్ కింద రాబోతున్నాయి.

