Tubeless Tyre: ట్యాగ్‌లో ఎన్ని పంచర్లు పడితే ప్రాణాపాయం? అసలు కారు టైర్ ఎప్పుడు మార్చాలి?
టైర్ ఎప్పుడు మార్చాలి?

Tubeless Tyre: ప్రస్తుత కాలంలో కార్లు లేదా బైక్ లలో ఎక్కువగా ట్యూబ్‌లెస్ టైర్లను వాడుతున్నారు. ఈ టైర్ల ప్రత్యేకత ఏమిటంటే.. పంచర్ అయినప్పటికీ గాలి ఒక్కసారిగా పోకుండా నెమ్మదిగా బయటకు వస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు బండిని కంట్రోల్ చేయడానికి కాస్త సమయం దొరుకుతుంది. అయితే చాలామంది పంచర్ అయితే కేవలం రిపేర్ చేయించుకుని మళ్లీ యథావిధిగా బండిని రోడ్డు మీదకు తీసుకెళ్తుంటారు. కానీ ఇలా పదే పదే పంచర్లు పడిన టైర్లను అలాగే వాడటం ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అసలు ఎన్ని పంచర్లు పడితే ఆ టైర్‌ను పూర్తిగా మార్చేయాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
టైర్ మార్చాలనే నిర్ణయం కేవలం పంచర్ల సంఖ్యను బట్టి మాత్రమే తీసుకోలేము. పంచర్ ఎక్కడ పడింది, ఎంత పెద్ద రంధ్రం అయింది, గతంలో చేసిన రిపేర్లు ఎలాంటివి అనే అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టైర్ మధ్య భాగంలో చిన్న చిన్న పంచర్లు పడితే సరిగ్గా రిపేర్ చేయించుకోవచ్చు. కానీ, ఒకే టైర్‌లో 3 నుంచి 4 సార్లు కంటే ఎక్కువ పంచర్లు పడితే మాత్రం దాని గట్టిదనం దెబ్బతింటుంది. అటువంటి సమయంలో నిపుణుల సలహా మేరకు టైర్‌ను మార్చడం ఎప్పుడూ సురక్షితం. ముఖ్యంగా రెండు పంచర్ల మధ్య కనీసం 150 మి.మీ దూరం ఉండేలా చూసుకోవడం మంచిది, లేదంటే ఆ ప్రాంతంలో రబ్బరు బలహీనపడుతుంది.
ఇక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే టైర్ సైడ్‌వాల్ భాగంలో పంచర్ పడటం. బండి నడుస్తున్నప్పుడు సైడ్‌వాల్ భాగం నిరంతరం ఒత్తిడికి గురవుతుంటుంది. ఇక్కడ గనుక రంధ్రం పడితే కేవలం ప్యాచ్ లేదా ప్లగ్ వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ప్రాణాలను పణంగా పెట్టకుండా వెంటనే కొత్త టైర్ వేయించుకోవడమే అత్యంత బుద్ధిచాలాకైన పని. అలాగే టైర్ అరిగిపోవడం, డీప్ కట్స్ ఏర్పడటం, రబ్బరు ఉబ్బడం లాంటి సమస్యలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా టైర్ మార్చేయాలి.
వాహనాన్ని నడిపేటప్పుడు ఎప్పుడూ సరైన ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. రోడ్లపై ఉండే పదునైన రాళ్లు, గాజు పెంకులు లేదా చెత్తాచెదారం తగలకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సాధారణంగా టైర్ల వయసు పెరిగేకొద్దీ వాటి మన్నిక తగ్గిపోతుంది. కాబట్టి ప్రయాణానికి వెళ్లే ముందు టైర్ల ఆరోగ్యాన్ని ఒకసారి సరిచూసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల నుంచి సులభంగా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

