డీలర్‎కు ఎంత మిగులుతుందో తెలుసా ?

Car Dealer Profit : మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అందులో దుకాణదారుడి లాభం ఎంతో కొంత ఉంటుంది. కారు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. లక్షలు పోసి కారు కొంటున్నప్పుడు, షోరూమ్ యజమానికి (డీలర్) భారీగా లాభం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, కారు అసలు ధర కి, మనం రోడ్డు మీదకు తెచ్చే ధరకు మధ్య ఉండే వ్యత్యాసంలో డీలర్ వాటా ఎంత? అసలు ఒక కారు అమ్మితే డీలర్ జేబులోకి ఎంత వెళ్తుంది? అనే విషయాలపై ఆసక్తికరమైన లెక్కలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కార్ల డీలర్లకు వచ్చే లాభం మనం అనుకున్నంత ఎక్కువగా ఏమీ ఉండదు. ఫాడా (Federation of Automobile Dealers Association) సర్వే ప్రకారం.. ఒక కారు అమ్మకంపై డీలర్‌కు సగటున 2.9% నుంచి 7.5% మధ్యలో మాత్రమే మార్జిన్ లభిస్తుంది. అంటే ఎంత ఎక్కువ సంఖ్యలో కార్లు అమ్ముడైతే డీలర్‌కు అంత ఎక్కువ లాభం అన్నమాట. కేవలం కార్ల అమ్మకాల మీద మాత్రమే ఆధారపడితే షోరూమ్ నడపడం కూడా కష్టమేనని నిపుణులు చెబుతుంటారు.

10 లక్షల కారు.. లాభం ఎంత?

ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మీరు ఒక 10 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధర కలిగిన కారు కొన్నారనుకోండి. డీలర్‌కు 5 శాతం మార్జిన్ ఉందని అనుకుంటే.. అతనికి వచ్చే ప్రత్యక్ష ఆదాయం రూ.50,000 మాత్రమే. అయితే, ఈ 50 వేల రూపాయలు మొత్తం అతని లాభం కాదు. ఇందులో నుంచే షోరూమ్ అద్దె, పని చేసే సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు, ప్రకటనల ఖర్చు, వెహికల్ సర్వీసింగ్ ఖర్చులు భరించాలి. ఇవన్నీ పోను డీలర్ చేతికి మిగిలే నికర లాభం చాలా తక్కువగా ఉంటుంది.

అదనపు సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది?

కేవలం కారు అమ్మకం మీద లాభం తక్కువగా ఉంటుంది కాబట్టే.. డీలర్లు ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. కారు కొనే సమయంలో మనం తీసుకునే ఇన్సూరెన్స్ పై డీలర్‌కు మంచి కమిషన్ వస్తుంది. అలాగే కారుకు అదనంగా అమర్చే యాక్సెసరీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫాస్టాగ్, లోన్ ప్రాసెసింగ్ ద్వారా వచ్చే కన్సల్టెన్సీ ఫీజు వంటివి డీలర్లకు అదనపు బలాన్ని ఇస్తాయి. నిజానికి కారు అమ్మకం కంటే ఈ అదనపు సేవల ద్వారానే డీలర్లు ఎక్కువ లాభం ఆర్జిస్తారు.

కంపెనీని బట్టి మార్జిన్లలో మార్పు

అన్ని కంపెనీలు ఒకేలాంటి కమిషన్ ఇవ్వవు. మారుతి సుజుకి, ఎంజీ మోటార్స్ వంటి కంపెనీలు కొన్ని మోడల్స్‌పై 5 శాతానికి పైగా మార్జిన్ ఇస్తుంటాయి. అయితే ఇది ఆ కారు డిమాండ్, ఉన్న నగరం, సేల్స్ టార్గెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కారు కొనే ముందు కేవలం షోరూమ్ ప్రైస్ మాత్రమే కాకుండా, ఆన్-రోడ్ ధరలో ఏయే ఖర్చులు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తే.. డీలర్ ఎక్కడ లాభం పొందుతున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే డీలర్ ఇచ్చే డిస్కౌంట్ల కోసం బేరమాడటం కస్టమర్ల హక్కు.

Updated On 19 Jan 2026 9:54 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story