ఎన్ని తులాల బంగారం కావాలో తెలుసా ?

Hyundai Creta : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బంగారం ధరల గురించే చర్చ జరుగుతోంది. ఒకవైపు పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు నెటిజన్లు సరదాగా లెక్కలు వేస్తున్నారు. "నా దగ్గర ఇంత బంగారం ఉంటే.. ఈ కారు కొనేవాడిని, ఆ ఇల్లు కొనేదాన్ని" అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా కొనాలంటే ఎన్ని గ్రాముల బంగారం కావాలో తెలుసుకుందాం.

మారుతున్న కాలంతో పాటు బంగారం ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,42,300 పలుకుతోంది. అంటే ఒక గ్రాము బంగారం విలువ దాదాపు రూ.14,230 అన్నమాట. ఈ భారీ ధరల నేపథ్యంలో ఒకవేళ మీరు నగదుకు బదులుగా బంగారాన్ని అమ్మి హ్యుందాయ్ క్రెటా కారును ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటే, మీకు సుమారు 88 నుంచి 90 గ్రాముల బంగారం(9 తులాలు) అవసరమవుతుంది.

హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ E 1.5L పెట్రోల్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.12.60 లక్షలుగా ఉంది. కారు ధరను బంగారం ధరతో భాగిస్తే (12,60,000 / 14,230), మనకు వచ్చే ఫలితం సుమారు 88.5 గ్రాములు. అంటే మీ ఇంట్లో దాదాపు 9 తులాల బంగారం ఉంటే, మీరు దర్జాగా షోరూమ్‌కి వెళ్లి క్రెటా బేస్ మోడల్‌ను నగదు చెల్లించకుండానే (బంగారాన్ని నగదుగా మార్చి) కొనేయొచ్చు. ఈ లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తక్కువ ధరలో వచ్చినప్పటికీ, క్రెటా బేస్ వేరియంట్ E ఫీచర్ల విషయంలో ఏమాత్రం తీసిపోదు. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 PS పవర్‌ను, 144 Nm టార్క్‌ను ఇస్తుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్‌స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి. దీని మైలేజ్ లీటరుకు 17 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్స్ వెళ్లడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎస్‌యూవీ.

హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్లో ప్రత్యర్థులు కూడా ఎక్కువే. కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, వోక్స్‌వ్యాగన్ టైగున్, టాటా హారియర్ వంటి కార్లు క్రెటాకు గట్టి పోటీనిస్తున్నాయి. అయినప్పటికీ, తన బ్రాండ్ వాల్యూ, రీసేల్ వాల్యూ కారణంగా క్రెటా ఇప్పటికీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. బంగారం ధరలు ఇలాగే పెరిగితే, భవిష్యత్తులో క్రెటా టాప్ ఎండ్ మోడల్ కూడా కొన్ని గ్రాముల బంగారంతోనే వచ్చేస్తుందని నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story