Honda : హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సిటీ, ఎలివేట్‌పై లక్షల మేర తగ్గింపు
సిటీ, ఎలివేట్‌పై లక్షల మేర తగ్గింపు

Honda : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2025 నెల కోసం ఎలివేట్ ఎస్‌యూవీ, సిటీ సెడాన్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్ వంటి తమ పాపులర్ మోడళ్లపై కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రూ. 95,500 వరకు జీఎస్టీ ప్రయోజనంతో పాటు, రూ. 1.32 లక్షల వరకు మొత్తం తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు తగ్గింపులు, లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు వంటివి ఉన్నాయి.
హోండా ఈ నెలలో ప్రకటించిన ఆఫర్లలో, ఎలివేట్ ఎస్‌యూవీ పైనే అత్యధిక ప్రయోజనం లభిస్తోంది. టాప్-స్పెక్ వేరియంట్‌పై వినియోగదారులు రూ. 1.32 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. టాప్-స్పెక్ ZX ట్రిమ్‌పై గరిష్టంగా రూ.1.32 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. VX వేరియంట్‌పై రూ.73,000 వరకు, V ట్రిమ్‌పై రూ.57,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ SV వేరియంట్‌పై కూడా రూ.25,000 వరకు డిస్కౌంట్ ప్రయోజనం ఉంది.
హోండా పాపులర్ సెడాన్ అయిన హోండా సిటీ పై కూడా మంచి డిస్కౌంట్‌లను ప్రకటించారు. ఈ వేరియంట్లపై వినియోగదారులు రూ.1.27 లక్షల వరకు ఆదా చేయవచ్చు. టాప్-ఎండ్ పెట్రోల్ ZX వేరియంట్‌పై కూడా రూ.1.02 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. సిటీ హైబ్రిడ్ వెర్షన్‌పై ప్రత్యక్ష డిస్కౌంట్ లేనప్పటికీ, కంపెనీ జూలైలో దీని ధరను సుమారు రూ.లక్ష వరకు తగ్గించింది.
హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌పై కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. హోండా ప్రస్తుతం సెకండ్-జనరేషన్ S ట్రిమ్‌ను, లేటెస్ట్ థర్డ్-జనరేషన్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది. పాత మోడల్‌పై రూ.97,200 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కొత్త అమేజ్ మోడల్‌పై రూ.67,200 వరకు ప్రయోజనం లభిస్తోంది. టాప్-ఎండ్ ZX CVT వేరియంట్ ధరను రూ.25,000 తగ్గించి, ఇప్పుడు రూ.9.99 లక్షలకు అందుబాటులో ఉంచారు. ఆల్ఫా బోల్డ్ ప్లస్ గ్రిల్ పై కంపెనీ ప్రత్యేక పండుగ డిస్కౌంట్ ప్రకటించింది. దీని ధర రూ.16,500 నుంచి రూ.9,900 కి తగ్గింది. ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ ధర కూడా రూ.36,500 నుంచి రూ.29,900 కి తగ్గింది. 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్ వంటి యాక్సెసరీస్ ఇంకా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్నాయి.
