Hybrid Vs EV Pricing: భారత ఆటోమొబైల్ మార్కెట్లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యాబ్రిడ్ కార్ల హవా వేగంగా పెరుగుతోంది. త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్న రెనాల్ట్ డస్టర్ హ్యాబ్రిడ్, కియా సెల్టోస్ హ్యాబ్రిడ్ మోడళ్లతో ఈ క్రేజ్ మరింత పెరగనుంది. అయితే ఇటీవల మార్కెట్ పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. హ్యాబ్రిడ్ కార్ల ధరలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో అసలు హ్యాబ్రిడ్ కార్లలో ఉన్న ప్రత్యేకత ఏంటి? కస్టమర్లు అంత రేటు పెట్టి దేనికి డబ్బులు చెల్లిస్తున్నారు? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఈవీ కంటే హ్యాబ్రిడ్ మోడళ్లే కాస్ట్లీ

మారుతి సుజుకి మోడళ్లను గమనిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. ఈ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.19 లక్షలు కాగా, విక్టోరిస్ హ్యాబ్రిడ్ రూ. 16.43 లక్షలు, గ్రాండ్ విటారా హ్యాబ్రిడ్ రూ. 16.68 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఎక్స్-షోరూమ్ వద్ద తేడా తక్కువగా ఉన్నప్పటికీ, ఆన్-రోడ్ ధరకు వచ్చేసరికి పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ-విటారా ఆల్ఫా ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 21.44 లక్షలు కాగా, విక్టోరిస్ హ్యాబ్రిడ్ ధర రూ. 23.23 లక్షలకు చేరుతోంది. అంటే హ్యాబ్రిడ్ వెర్షన్ దాదాపు రూ. 1.79 లక్షలు అదనంగా ఉంటోంది.

అసలు దేనికి మనం డబ్బులు ఇస్తున్నాం?

స్ట్రాంగ్ హ్యాబ్రిడ్ కార్లలో కేవలం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉండదు. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ సిస్టమ్ కూడా కలిసి ఉంటాయి. కార్ ప్రయాణించేటప్పుడు అవసరాన్ని బట్టి ఈ రెండు పవర్ సోర్స్‌లను సిస్టమ్ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ సాంకేతికతలోని ప్రధాన సౌకర్యం ఏంటంటే, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు, బ్రేకులు వేసేటప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఛార్జింగ్ భయాలు అస్సాలు ఉండవు.

ఈవీల ధర వెనుక దాగున్న భారీ బ్యాటరీలు

ఎలక్ట్రిక్ వాహనాల పర్ఫామెనస్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ ఉండదు, కేవలం భారీ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌పైనే కారు నడుస్తుంది. ఉదాహరణకు ఈ-విటారాలో 49kWh, 61kWh బ్యాటరీలు ఇస్తుంటే, క్రెటా ఈవీలో 51.4kWh బ్యాటరీ వస్తుంది. అంటే హ్యాబ్రిడ్ కార్ కొన్నప్పుడు పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ, వీటిని సమన్వయం చేసే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కస్టమర్ డబ్బులు చెల్లిస్తారు. అదే ఈవీల విషయంలో ధరలో ఎక్కువ భాగం కేవలం పెద్ద బ్యాటరీ ప్యాక్‌కే పోతుంది.

ఏది కొంటే మంచిది?

కారు కొనేటప్పుడు ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే కాకుండా ఆన్-రోడ్ ధరను సరిగ్గా లెక్కించాలి. పెట్రోల్ సౌకర్యంతో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే వారికి, ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకడం ఇష్టం లేని వారికి హ్యాబ్రిడ్ కార్లు సరైన ఎంపిక. ఇంటి దగ్గర లేదా ఆఫీస్ వద్ద సులభంగా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నవారికి ఈవీలు బెటర్ ఆప్షన్. మున్ముందు డస్టర్, సెల్టోస్, క్రెటా హ్యాబ్రిడ్ మోడళ్ల ఎంట్రీతో ఈ విభాగంలో పోటీ మరింత వేడెక్కనుంది.

Next Story