Suzuki Swift : హైడ్రోజన్ స్విఫ్ట్ వచ్చేసింది.. పెట్రోల్ అవసరమే లేదు.. సరికొత్త టెక్నాలజీతో సుజుకి సంచలనం
సరికొత్త టెక్నాలజీతో సుజుకి సంచలనం

Suzuki Swift : ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్-డీజిల్ ధరల నుంచి విముక్తి పొందేందుకు కంపెనీలు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా హైడ్రోజన్ కార్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కారు సుజుకి స్విఫ్ట్ హైడ్రోజన్ వెర్షన్‌లో కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తున్నా, హైడ్రోజన్ ఇంధనాన్ని భవిష్యత్తు టెక్నాలజీగా భావిస్తున్నారు. ఆస్ట్రియాకు చెందిన పవర్‌ట్రెయిన్ కంపెనీ AVL టెక్నాలజీస్ సుజుకితో కలిసి సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ ఆధారంగా ఈ హైడ్రోజన్ కారును తయారు చేసింది. ఇది సాధారణ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్లలా కాకుండా, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌ను వాడుతుంది. అంటే ఇది పెట్రోల్ ఇంజన్ లాగే పనిచేస్తుంది, కానీ పెట్రోల్‌కు బదులుగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతుంది. దీనివల్ల తయారీ ఖర్చు తగ్గడమే కాకుండా సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
1.4 లీటర్ ఇంజన్‌తో అదిరిపోయే పవర్
సాధారణంగా గ్రీన్ ఫ్యూయల్ కార్లు అంటే పవర్ తక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఈ హైడ్రోజన్ స్విఫ్ట్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో ఉన్న 1.4 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ హైడ్రోజన్ ఇంజన్ ఏకంగా 134 హెచ్‌పి (hp) పవర్‌ను, 220 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ పెట్రోల్ ఇంజన్‌తో పోలిస్తే ఇందులో 13 hp అదనపు పవర్, 20 Nm ఎక్కువ టార్క్ లభిస్తుంది. అంటే ఇది పర్యావరణానికే కాదు, పర్ఫార్మెన్స్ విషయంలోనూ మేటి అని నిరూపిస్తోంది.
గడ్కరీ గారి గ్రీన్ విజన్
భారత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటి నుంచో హైడ్రోజన్ ఇంధన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి.. ఇథనాల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వంటి స్వదేశీ ఇంధనాల వైపు మళ్లాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఆయన టయోటా మిరాయ్ వంటి హైడ్రోజన్ కార్లను స్వయంగా వాడుతూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. సుజుకి వంటి అగ్రగామి కంపెనీ ఈ దిశగా అడుగులు వేయడం భారత ఆటోమొబైల్ రంగానికి శుభసూచకం.
భవిష్యత్తులో మార్పులు ఇవే
ప్రస్తుతం ఈ హైడ్రోజన్ స్విఫ్ట్ కేవలం ఒక టెక్నాలజీ ప్రోటోటైప్ మాత్రమే. అంటే దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి తయారు చేశారు. ఒకవేళ మారుతీ సుజుకి దీనిని ఇండియాలో కమర్షియల్‌గా లాంచ్ చేస్తే, ఇక్కడి కార్ల మార్కెట్ మొత్తం మారిపోతుంది. స్విఫ్ట్ వంటి పాపులర్ బ్రాండ్‌తో హైడ్రోజన్ టెక్నాలజీని ప్రవేశపెడితే ప్రజలు కూడా త్వరగా ఆకర్షితులవుతారు. అయితే దేశవ్యాప్తంగా హైడ్రోజన్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా రాబోయే కొన్నేళ్లలో హైడ్రోజన్ కార్లు భారత రోడ్లపై సందడి చేయడం ఖాయం.

