Hyundai Bayon: తక్కువ ఖర్చు.. అదిరిపోయే మైలేజ్.. హ్యుందాయ్ నుంచి ఫస్ట్ మిడ్‌సైజ్ CNG SUV ఎంట్రీ
ఫస్ట్ మిడ్‌సైజ్ CNG SUV ఎంట్రీ

Hyundai Bayon: భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే హ్యుందాయ్ బేయాన్ మోడల్లో సీఎన్జీ వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జనవరి 2027లో ఈ కారును అధికారికంగా భారత రహదారులపైకి తీసుకురానున్నారు. హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియో నుంచి వస్తున్న తొలి మిడ్‌సైజ్ సీఎన్జీ ఎస్యూవీ ఇదే కావడం విశేషం. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
పవర్ఫుల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బేయాన్ పెట్రోల్ మోడల్లో 1.5-లీటర్, 4-సిలిండర్ ఎంపీఐ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 115 పీఎస్ పవర్, 143.8 ఎన్ఎమ్ టాార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవే తరహా ఇంజిన్‌ను క్రెటా, కియా సెల్టోస్ కార్లలో కూడా అమర్చారు. ఇప్పటివరకు ఈ మోడల్ ఇంజిన్‌తో దాదాపు 6 లక్షల కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. రాబోయే సీఎన్జీ మోడల్లో కూడా ఇదే ఇంజిన్‌ను అందించబోతున్నారు. సీఎన్జీ మోడ్‌లోకి మారినప్పుడు పవర్ కాస్త తగ్గి సుమారు 100 పీఎస్ పవర్, 125 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే అవకాశం ఉంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించవచ్చు.
లగేజీ స్థలానికి కొరత ఉండదు
సాధారణంగా సీఎన్జీ కార్లను కొనుగోలు చేసేటప్పుడు లగేజ్ డిక్కీ తగ్గిపోతుందనే చింత అందరిలోనూ ఉంటుంది. సిలిండర్ అమర్చడం వల్ల సామాన్లు పెట్టుకోవడానికి స్థలం దొరకదు. అయితే హ్యుందాయ్ ఈ సమస్యకు చెక్ పెట్టబోతోంది. పెట్రోల్ వర్షన్లో ఉన్న 505 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను సీఎన్జీ వెర్షన్లోనూ కాపాడేందుకు కంపెనీ ప్రత్యేక ప్లాన్ వేసింది. డిక్కీ ఫ్లోర్ కిందనే సీఎన్జీ ట్యాంకులను అమర్చే డుయల్ సిలిండర్ సాంకేతికతను ఇందులో వాడే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్టర్ హై-సీఎన్జీ డ్యూయో కారులో ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు.
దిగ్గజ కార్లకు పోటీ
హ్యుందాయ్ బేయాన్ సీఎన్జీ నేరుగా మార్కెట్లో ఉన్న పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి విక్టోరిస్, గ్రాండ్ విటారా, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ వేరియంట్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ప్రస్తుత ప్రత్యర్థి కార్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండగా, బేయాన్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ రావడం వల్ల మైలేజ్, లాంగ్ రైడింగ్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది. మైలేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ సమయంలో స్పష్టమవుతాయి.
లైనప్‌లో మైలేజ్ ధమాకా
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ బేయాన్ పెట్రోల్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.99 లక్షల వరకు ఉంది. సాధారణంగా పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే సీఎన్జీ మోడళ్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీంతో బేయాన్ సీఎన్జీ ధర కూడా పెట్రోల్ వేరియంట్ కంటే రూ. 80,000 నుంచి లక్ష రూపాయిల వరకు పెరిగే అవకాశం ఉంది. జనవరి 2027లో లాంచ్ అయ్యేటప్పుడు దీని ఖచ్చితమైన ఎక్స్-షోరూమ్ ధరలు వెల్లడి కానున్నాయి.

