Hyundai Bayon: హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీ హ్యుందాయ్ బేయాన్ కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ కారు లాంచ్ అయి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకముందే, ఎంపిక చేసిన వేరియంట్లపై ఏకంగా రూ.99,988 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారును కంపెనీ వెన్యూ కంటే పైన, క్రెటా కంటే కింది విభాగంలో నిలబెట్టింది. ధర విషయంలో క్రెటా కంటే సుమారు రూ.91,000 తక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, 2027 జనవరిలో ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ కూడా విడుదల కానుంది.

డిసెంబర్ 31 వరకు రూ.99,988 బెనిఫిట్స్

అక్టోబర్ 26న లాంచ్ అయిన సరిగ్గా 24 రోజుల తర్వాత హ్యుందాయ్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 2026 డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. గతంలో ఈ ఎస్‌యూవీపై కేవలం రూ.5,000 స్క్రాపేజ్ బోనస్ మాత్రమే ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.65,000కి పెంచారు. దీనికి అదనంగా రూ.24,189 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ, రూ.10,799 విలువైన డ్యామేజ్ సేఫ్టీ కవర్ లభిస్తున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో నేరుగా క్యాష్ డిస్కౌంట్ మాత్రం లేదు. ఎంపిక చేసిన ఆటోమేటిక్ వేరియంట్లపై మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఆకర్షణీయమైన డిజైన్.. ప్రీమియం క్యాబిన్ ఫీచర్లు

హ్యుందాయ్ బేయాన్ ముందు భాగంలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్లుగా పనిచేసే L-ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లు అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో 17-అంగుళాల పెటల్ డిజైన్ అలాయ్ వీల్స్ ఆకట్టుకుంటున్నాయి. లోపల క్యాబిన్‌లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు మరో 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఏసీ నియంత్రణ కోసం ప్రత్యేక ప్యానెల్, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS

ప్రయాణికుల భద్రత కోసం ఈ ఎస్‌యూవీలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి టాప్ క్లాస్ ఫీచర్లు అందించారు. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఈ కారు ప్లాట్‌ఫామ్ BNCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించే సామర్థ్యం కలిగి ఉందని హ్యుందాయ్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కొలతలు, మార్కెట్లో పోటీ కార్లు ఇవే..

హ్యుందాయ్ బేయాన్ 4,245 మి.మీ పొడవు, 1,810 మి.మీ వెడల్పు, 1,605 మి.మీ ఎత్తు కలిగి ఉంది. 205 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 505 లీటర్ల భారీ బూట్ స్పేస్ దీని ప్రత్యేకత. భారత మార్కెట్లో ఈ కారు మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, టాటా సియెర్రా, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగూన్, ఎంజీ ఆస్టర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తోంది.

Next Story