Hyundai vs Maruti: హ్యుందాయ్ నయా SUV వర్సెస్ మారుతి కొత్త మోడల్.. రోడ్డుపై కింగ్ ఎవరు గురు?
రోడ్డుపై కింగ్ ఎవరు గురు?

Hyundai vs Maruti: భారతీయ మార్కెట్లో ఎస్యూవీ వాహనాలకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ సంస్థ తన సరికొత్త బేయాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానంలో కంపెనీ దీనిని పొందుపరిచింది. భారత మార్కెట్లో ఈ కారు నేరుగా మారుతి సుజుకి విక్టోరిస్ మోడల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. రూ.9.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన హ్యుందాయ్ బేయాన్, మారుతి విక్టోరిస్ మధ్య ఉన్న ఫీచర్లు, ధరలు, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి.
ధర విషయంలో ఎవరు ముందున్నారు?
ధరల విషయానికి వస్తే హ్యుందాయ్ బేయాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9,99,900గా ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.17,99,900 వరకు వెళ్తుంది. మరోవైపు మారుతి సుజుకి విక్టోరిస్ మొత్తం 21 వేరియంట్లలో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10,49,900 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.19,98,900 వరకు ఉంటుంది. అంటే మారుతి విక్టోరిస్ కంటే హ్యుందాయ్ బేయాన్ ప్రారంభ ధర రూ.50 వేలు తక్కువగా ఉండటం కస్టమర్లను ఆకట్టుకునే విషయంగా మారింది.
సైజ్, బూట్ స్పేస్ లెక్కలు ఇవే
కొలతల పరంగా హ్యుందాయ్ బేయాన్ పొడవు 4,245 మిమీ, వెడల్పు 1,810 మిమీ, ఎత్తు 1,605 మిమీగా ఉన్నాయి. ప్రయాణాల్లో ఎక్కువ లగేజ్ సర్దుకోవడానికి ఇందులో ఏకంగా 505 లీటర్ల భారీ బూట్ స్పేస్ అందించారు. అలాగే మారుతి విక్టోరిస్ పొడవు 4,360 మిమీ, ఎత్తు 1,655 మిమీ కాగా, వెడల్పు 1,795 మిమీగా ఉంది. ఇందులోని వేరియంట్‌ను బట్టి 439 నుంచి 446 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే లభిస్తుంది. రెండింటి వీల్‌బేస్ 2,600 మిమీగా ఉన్నప్పటికీ, పొడవులో విక్టోరిస్ పెద్దదిగానూ, వెడల్పు, బూట్ స్పేస్‌లో బేయాన్ పైచేయి సాధిస్తోంది.
ఇంటీరియర్ ఫీచర్లు.. టెక్నాలజీ పోటీ
హ్యుందాయ్ బేయాన్ కేబిన్ లోపల రెండు 12.3 ఇంచుల పెద్ద స్క్రీన్లను ఇచ్చారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులో 10 భారతీయ భాషలను అర్థం చేసుకునే ఏఐ వాయిస్ అసిస్టెంట్, లెవెల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఇక మారుతి విక్టోరిస్‌లో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, లెవెల్-2 ADAS సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికుల భద్రతలో విక్టోరిస్ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది.
ఇంజిన్ పవర్.. మైలేజ్ తేడాలు
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 113 bhp పవర్, 144 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది లీటరుకు సుమారు 17.5 నుంచి 18.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరోవైపు మారుతి విక్టోరిస్‌లో 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్, సిఎన్జి ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్ లీటరుకు ఏకంగా 28.65 కిలోమీటర్ల భారీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా సరైన ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు.

