Car Prices Hike : కార్ల ప్రియులకు బ్యాడ్ న్యూస్..జనవరి 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
జనవరి 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు

Car Prices Hike : కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చులు, ముడి సరుకుల ధరల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం హ్యుందాయ్ మాత్రమే కాదు, టాటా, మారుతి, రెనాల్ట్ వంటి మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
హ్యుందాయ్ ఇండియా తన కార్ల ధరలపై సుమారు 0.6 శాతం మేర భారాన్ని పెంచుతోంది. ఈ పెంచిన ధరలు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ప్రస్తుతం రూ.5.47 లక్షల (గ్రాండ్ i10 నియోస్) నుంచి రూ.46.30 లక్షల (అయానిక్ 5) వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. తాజా పెంపుతో వేరియంట్‌ను బట్టి వేల రూపాయల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, రూ. 10 లక్షల కారుపై సుమారు రూ.6,000 వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
కార్ల తయారీలో వాడే ఇనుము, స్టీల్, విలువైన లోహాల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. గత కొన్ని నెలలుగా కంపెనీ ఈ అదనపు భారాన్ని భరిస్తున్నప్పటికీ, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భాగాన్ని కస్టమర్లపైకి నెట్టాల్సి వస్తోందని హ్యుందాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు పెరగడం కూడా ఈ ధరల పెంపుకు మరో కారణం.
కేవలం హ్యుందాయ్ మాత్రమే కాదు, ఇతర దిగ్గజ సంస్థలు కూడా తమ ధరల పట్టికను మారుస్తున్నాయి.
రెనాల్ట్ : జనవరి నుంచి తమ కార్లపై 2 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
JSW MG మోటార్: వీరు కూడా తమ మొత్తం మోడల్ రేంజ్‌పై 2 శాతం వరకు ధరలు పెంచనున్నారు.
టాటా మోటార్స్, మారుతి సుజుకి: ఈ కంపెనీలు కూడా జనవరిలో ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముడి సరుకుల ఖర్చుల దృష్ట్యా ఇవి కూడా 1 నుంచి 2 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
లగ్జరీ కార్లు: మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ధరలు కూడా 2 నుంచి 3 శాతం వరకు పెరగనున్నాయి.
మీరు గనుక హ్యుందాయ్ క్రెటా, వెన్యూ లేదా మారుతి, టాటా కార్లను కొనే ఆలోచనలో ఉంటే, డిసెంబర్ నెలాఖరులోపు బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇయర్ ఎండ్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మరింత లాభం ఉంటుంది.

