సరికొత్త మోడల్‎ను మార్కెట్లోకి దించనున్న హ్యుందాయ్

Hyundai EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వేగంగా దూసుకుపోతోంది. ఈ పెరుగుతున్న మార్కెట్‌లో తమ వాటాను బలోపేతం చేసుకోవడానికి హ్యుందాయ్ మోటార్ కంపెనీ సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ డే 2025 సందర్భంగా హ్యుందాయ్ 2027 నాటికి భారతదేశంలో ఒక కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ మోడల్‌ను పూర్తిగా ఇండియాలోనే డిజైన్ చేసి, ఇంజనీరింగ్ చేసి, తయారు చేయనున్నారు.

ఈ కొత్త ఈవీకి HE1i అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇది సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లోని ఎస్‌యూవీ మోడల్. ఈ కారు మార్కెట్‌లో టాటా పంచ్ ఈవీతో పోటీ పడనుంది. హ్యుందాయ్ ఈ కొత్త కారు కంపెనీ E-GMP (K) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. ప్రస్తుతం విదేశాలలో అమ్ముడవుతున్న హ్యుందాయ్ ఇన్‌స్టర్లో కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించారు. కంపెనీ దీనిని తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేయనుంది. దీని ద్వారా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించవచ్చు. అంతేకాక ఇందులో ఉపయోగించే బ్యాటరీలు కూడా ఎక్సైడ్ వంటి దేశీయ కంపెనీల నుండి తీసుకోనున్నారు.

హ్యుందాయ్ ఈ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఇస్తున్నట్లు కన్ఫాం చేసింది. స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్. యూరోపియన్ మార్కెట్‌లో ఇన్‌స్టర్‌తో 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్‌లు లభిస్తున్నాయి. ఇవి వరుసగా 300 కిలోమీటర్లు, 355 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తాయి. స్టాండర్డ్ వెర్షన్‌లో 97hp మోటార్, లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 115hp మోటార్‌ను ఉపయోగించారు. దీనిని బట్టి, హ్యుందాయ్ ఈ కొత్త కాంపాక్ట్ ఈవీ కేవలం ఇంధన సామర్థ్యంలోనే కాకుండా, పనితీరులో కూడా పవర్ఫుల్‎గా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఫీచర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ ఈ కారులో లెవెల్ 2 ADASను అందించాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఈ సెగ్మెంట్‌లో ఈ కారును మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అలాగే, ఇందులో OTA (ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్ సపోర్ట్ ఉన్న లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. కారులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మ్యూనోజ్ ప్రకారం.. ఈ కారు భారత మార్కెట్లో హ్యుందాయ్‌కు ఒక మైలురాయిగా నిలవనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story