7 నెలల్లోనే రికార్డ్ సేల్స్!

Hyundai : కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఏ కారు కొనాలని ఆలోచిస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా దూసుకుపోతుంది. గత కొన్ని నెలలుగా మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా హవా నడుస్తోంది. ఇప్పుడు కూడా అది తన సత్తా చాటింది.

ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే అగ్రస్థానంలో నిలిచి, భారతీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ఈ కారుకు ఉన్న డిమాండ్ చూస్తే, ప్రజలు కళ్ళు మూసుకుని కొనేస్తున్నారేమో అనిపించక మానదు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రకటించిన వివరాల ప్రకారం, 2025 సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు హ్యుందాయ్ క్రెటా. గత 7 నెలల్లోనే ఏకంగా 1,17,458 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది అమ్మకాలతో పోలిస్తే 8% ఎక్కువ కావడం విశేషం.కేవలం ఒకటో రెండో నెలలు కాదు, దాదాపు ఏడాది పొడవునా ఈ కారు టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది.

2015లో మొదటిసారిగా లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా, భారతీయ మార్కెట్‌లో తన 10ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఇది ఎన్నో మైలురాళ్లను దాటింది. 2025లో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలవడమే కాకుండా, గత 6 నెలల్లో 3 నెలల పాటు అన్ని కార్ల అమ్మకాల్లోనూ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటివరకు క్రెటా 12 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో 31% కంటే ఎక్కువ మార్కెట్ షేర్‌తో క్రెటా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా మూడు వేరియంట్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ SUV ధర రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అవసరాలకు బట్టి ఈ కారును ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా మైలేజ్ దాని వేరియంట్‌ను బట్టి మారుతుంది. పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 17.4 కి.మీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 18.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇక డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, మాన్యువల్‌తో లీటరుకు 21.8 కి.మీ, ఆటోమేటిక్‌తో 19.1 కి.మీ మైలేజ్ లభిస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే క్రెటా కారులో అత్యాధునిక టెక్నాలజీ ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ADAS ఫీచర్లలో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ కొలిషన్ వార్నింగ్, కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story