Hyundai Creta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ కార్లకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2027 మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో హ్యుందాయ్ బ్రాండ్ తరఫున అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా హ్యుందాయ్ క్రెటా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఆరు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 89,727 మంది కస్టమర్లు క్రెటాను కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే కాలంలో 99,345 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి స్వల్పంగా 9.69 శాతం క్షీణత నమోదైనప్పటికీ కంపెనీ ఇతర మోడళ్ల కంటే ఇది చాలా ముందంజలో ఉంది.

ఇతర మోడళ్ల అమ్మట్లలో అద్భుత వృద్ధి

క్రెటా అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, హ్యుందాయికి చెందిన ఇతర ప్రముఖ మోడళ్లు అద్భుతమైన వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. హ్యుందాయ్ వెన్యూ 68,836 యూనిట్ల విక్రయాలతో 37.74 శాతం వృద్ధిని సాధించగా, మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్ 46,156 యూనిట్లతో ఏకంగా 40.01 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. అలాగే పాపులర్ సెడాన్ ఆరా 35,673 యూనిట్లు అమ్ముడై 18.05 శాతం వృద్ధిని చూపించింది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఐ20 మోడల్ 32.34 శాతం వృద్ధితో 29,530 యూనిట్లు, ఐ10 నియోస్ 26,561 యూనిట్ల విక్రయాలను సాధించి కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.

15 లక్షల విక్రయాల చారిత్రాత్మక మైలురాయి

భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా సరికొత్త చరిత్ర సృష్టించింది. జూలై 2015లో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ, సెప్టెంబర్ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఏకంగా 15,12,036 యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. సుమారు 11 సంవత్సరాల కాలంలో ఈ అరుదైన ఘనతను సాధించడం విశేషం. భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూం ధర రూ.10.91 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటూ కుటుంబ సభ్యులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని ఇస్తోంది.

పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, సేఫ్టీ ఫీచర్లు

కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా క్రెటాలో శక్తివంతమైన ఇంజిన్లను అమర్చారు. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 113 bhp పవర్‌ను, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 bhp పవర్‌ను ఇస్తాయి. అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. భద్రత విషయానికి వస్తే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ప్రామాణికంగా లభిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్లలో లెవెల్-2 అడాస్ టెక్నాలజీతో పాటు 70కి పైగా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Next Story