Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా సంచలనం.. 6 నెలల్లో 10 ఏళ్ల రికార్డు బద్దలు
6 నెలల్లో 10 ఏళ్ల రికార్డు బద్దలు

Hyundai Creta : భారత మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) ఈ ఎస్‌యూవీ ఒక సంచలన రికార్డును నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ మొత్తం అమ్మకాల్లో క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడమే కాకుండా, తన 10 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది. హ్యుందాయ్ విక్రయించిన మొత్తం ఆరు ఎస్‌యూవీ మోడళ్లలో, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పెరిగిన ఏకైక మోడల్ క్రెటా మాత్రమే కావడం విశేషం.
ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) హ్యుందాయ్ క్రెటా తన విక్రయాలతో మార్కెట్‌ను ఆకర్షించింది. ఈ ఆరు నెలల కాలంలో హ్యుందాయ్ డీలర్లకు పంపిన మొత్తం 1,89,751 ఎస్‌యూవీ యూనిట్లలో, క్రెటా ఒక్కటే 99,345 యూనిట్లను (36% వాటా) విక్రయించి అగ్రస్థానంలో నిలిచింది.
హ్యుందాయ్ విక్రయిస్తున్న ఆరు ఎస్‌యూవీ మోడళ్లలో గతేడాదితో పోలిస్తే అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన ఏకైక మోడల్ క్రెటా మాత్రమే. ఇతర మోడళ్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, క్రెటా తన పట్టును నిలబెట్టుకుంది. మొత్తం ఎస్‌యూవీ, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గినప్పటికీ, క్రెటా పుణ్యమా అని హ్యుందాయ్ తన కీలక వాటాను నిలబెట్టుకోగలిగింది.
హ్యుందాయ్ మొత్తం ఎస్‌యూవీ అమ్మకాలు 7% తగ్గి 1,89,751 యూనిట్లుగా, మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 9% తగ్గి 2,71,780 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2025లో క్రెటా రికార్డు స్థాయిలో 18,861 యూనిట్లను విక్రయించింది. దీని ఫలితంగా, హ్యుందాయ్ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 72% కి చేరింది. ఇది హ్యుందాయ్‌కి అత్యధిక నెలసరి వాటా కావడం విశేషం.
హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ధర రూ.10.73 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ.20.20 లక్షల వరకు ఉంది. మైలేజ్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ రకాన్ని బట్టి మారుతుంది. మాన్యువల్ పెట్రోల్ లీటరుకు 17.4 కి.మీ, మాన్యువల్ డీజిల్ లీటరుకు 21.8 కి.మీ, ఆటోమేటిక్ పెట్రోల్ లీటరుకు 18.4 కి.మీ, ఆటోమేటిక్ డీజిల్ లీటరుకు 19.1 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.
