ఇప్పటికి ఎన్ని లక్షల మంది కొన్నారంటే ?

Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్‌లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీనిని మొదటిసారిగా జులై 21, 2015న విడుదల చేశారు. అప్పటినుంచి ఈ కారు భారత మార్కెట్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇది భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్‌గా నిలుస్తోంది. హ్యుందాయ్ ఇప్పటివరకు ఈ కారులో 15 లక్షలకు పైగా యూనిట్లను తయారు చేసింది. ఇందులో 12 లక్షలకు పైగా యూనిట్లు దేశీయ మార్కెట్‌లో, 3 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి అయ్యాయి.

ఈ పది సంవత్సరాలలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కొత్త కారు అమ్మకాలు, మార్కెట్ వాటా పరంగా నిరంతరం వార్తల్లో నిలిచింది. గత పదేళ్లలో కస్టమర్ల అభిరుచులు, ఫీచర్ల డిమాండ్ , ఎస్‌యూవీ విభాగంలో ఎంత మార్పు వచ్చిందో క్రెటా పర్ఫామెన్స్ చూపిస్తుంది. ఈ కాలంలో భారతదేశంలో ఎస్‌యూవీ బాడీ స్టైల్ ఒక ప్రత్యేక విభాగం నుండి సాధారణ ప్రజల ఆదరణ పొందింది. 2015లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రెండు మోడళ్లు మాత్రమే ఉండగా, 2025 నాటికి డజనుకు పైగా మోడళ్లు వచ్చాయి. అయినా కూడా, క్రెటా ప్రతి సంవత్సరం లాంచ్ అయినప్పటి నుండి అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, 2016లో హ్యుందాయ్ క్రెటా 92,926 యూనిట్లు అమ్ముడవగా, 2024లో ఈ సంఖ్య 1,86,919 యూనిట్లకు పెరిగింది. 2025 జనవరి నుండి జూన్ మధ్య మూడు నెలల్లో ఇది ఎస్‌యూవీ విభాగంలోనే కాకుండా, అన్ని కార్ల విభాగాల్లో అత్యధిక అమ్మకాలు సాధించింది. మార్కెట్ వాటా విషయానికి వస్తే, కంపెనీ ప్రకారం క్రెటా ఇప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో 31 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీని కొనుగోలుదారులలో మొదటిసారి కారు కొనేవారి సంఖ్య 2020లో 12శాతం ఉండగా, 2024లో అది 29శాతానికి పెరిగింది. 2025 మొదటి అర్ధభాగంలో అమ్ముడైన క్రెటా మోడల్స్‌లో దాదాపు 70 శాతం సన్‌రూఫ్ ఉన్నవి. ఇది కస్టమర్లు ఇప్పుడు ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లను ఇష్టపడుతున్నారని చూపిస్తుంది.

ఇప్పుడు కస్టమర్లు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ టెక్నాలజీ, వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో ఇప్పుడు చాలా బలమైన పోటీదారులు ఉన్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు, క్రెటా 13కు పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పటివరకు భారతదేశం నుండి 2.87 లక్షల యూనిట్లు బయటి దేశాలకు పంపబడ్డాయి. క్రెటా పెట్రోల్, డీజిల్, టర్బో-పెట్రోల్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌లతో వస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ధర రూ.11.11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.20.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా 3 ఇంజిన్ ఆప్షన్‌లలో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. క్రెటా డీజిల్ మోడల్ లీటరుకు 21.8 కిమీ మైలేజ్ ఇవ్వగలదు, అయితే పెట్రోల్ మోడల్ లీటరుకు 17కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story