Hyundai Creta: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా నెక్స్ట్ జనరేషన్ మోడల్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త క్యాబిన్ ఫీచర్లు, తొలిసారిగా పరిచయం కానున్న హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌తో 2027 నాటికి ఈ ఎస్‌యూవీ రోడ్డెక్కే అవకాశం ఉంది. విదేశాల్లో రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాలకు చిక్కిన స్పై షాట్ల ఆధారంగా కొత్త క్రెటా డిజైన్‌లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముందరి, వెనుక బంపర్లను పూర్తిగా సరికొత్త శైలిలో తీర్చిదిద్దారు. హెడ్‌లైట్లు, టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌ను మార్చడంతో పాటు నూతన అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ అవుట్‌సైడ్ రీయర్ వ్యూ మిర్రర్లను అమర్చారు. ఈ కొత్త హెచ్‌డి అప్‌డేట్‌లతో ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత మోడర్న్‌గా, స్పోర్టీ లుక్‌లో ఆకట్టుకోనుంది.

హైటెక్ ఫీచర్లతో లగ్జరీ క్యాబిన్

కేవలం బాహ్య రూపురేఖలే కాకుండా, కారు లోపలి భాగంలోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. సరికొత్త డాష్‌బోర్డ్, మోడర్న్ సీటింగ్, ప్రీమియం అప్హోల్స్టరీతో కేబిన్ రూపుదిద్దుకుంటోంది. డ్రైవింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా కర్వ్‌డ్ స్క్రీన్ సెటప్‌ను అందించనున్నారు. ఫ్రంట్ ప్యాసింజర్ సీటు కోసం బాస్ మోడ్ ఫీచర్‌ను జోడించే అవకాశం ఉంది. భారత్‌లో తొలిసారిగా ప్లియోస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేస్తూ మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లను అందుబాటులోకి తేనున్నారు.

మైలేజ్ రాకెట్ లా పెంచే హైబ్రిడ్ ఇంజిన్

ఇంజిన్ రంగానికి వస్తే హ్యుందాయ్ ఒక సంచలనాత్మక అడుగు వేయబోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో పాటు తొలిసారిగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హైబ్రిడ్ సాంకేతికత అందుబాటులోకి వస్తే నగర ప్రయాణాల్లో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి, అద్భుతమైన మైలేజ్ లభిస్తుంది. కాగా, ఇదే సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను రాబోయే క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

పోటీదారులకు కఠిన సవాలు

భారత్‌లో హ్యుందాయ్ సాధిస్తున్న మొత్తం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా అత్యంత కీలకం. రాబోయే కాలంలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న నిస్సాన్ టెక్టాన్, టాటా సియెర్రా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. మరోవైపు కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 నియోస్ కారును సైతం పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెరిగిన పరిమాణంతో పాటు ఎక్స్‌టర్ తరహా ఫీచర్లు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జీతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌ను అందించే ఆలోచనలో ఉంది.

Next Story