New SUVs : హ్యుందాయ్ క్రెటా గుత్తాధిపత్యానికి బ్రేక్.. దీపావళి కల్లా మార్కెట్లోకి 4 అదిరిపోయే నయా ఎస్‌యూవీలు
దీపావళి కల్లా మార్కెట్లోకి 4 అదిరిపోయే నయా ఎస్‌యూవీలు

New SUVs : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. మోడ్రన్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, విభిన్న ఇంజన్ ఆప్షన్లతో క్రెటా చాలా కాలంగా ఈ విభాగంలో రారాజుగా వెలుగుతోంది. మార్కెట్లోకి ఎన్ని కొత్త కార్లు వచ్చినా క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అయితే, ఈ హవాకు చెక్ పెట్టేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకీ, హోండా, రెనో, నిస్సాన్ సంచలన వ్యూహాన్ని సిద్ధం చేశాయి. 2026 దీపావళి పండుగ సీజన్ నాటికి సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చి క్రెటాకు నేరుగా సవాల్ విసరడానికి ఈ కంపెనీలు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
జూలై 9న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న నిస్సాన్ టెక్టాన్
ఈ కొత్త కార్ల పరంపరలో అందరికంటే ముందు నిస్సాన్ సంస్థ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిస్సాన్ తన సరికొత్త మోడల్ టెక్టాన్ ఎస్‌యూవీని జూలై 9న భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఇది రోడ్లపైకి రానుంది. ఈ కారు సరికొత్త ఆర్‌జీఎమ్‌పీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందింది. రాబోయే రెనో డస్టర్ కారును పోలి ఉన్నప్పటికీ, దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా, లగ్జరీగా ఉంటుంది. నిస్సాన్ కంపెనీకి చెందిన గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీ స్ఫూర్తితో దీని లుక్‌ను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఇందులో డస్టర్ లాగే 1.0 లీటర్ టర్బో, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది, కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ ఉండకపోవచ్చు.
మరింత స్టైలిష్‌గా మారనున్న మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారాను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త 2026 మోడల్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు కేబిన్ లోపల కొన్ని అత్యాధునిక ఫీచర్లను జోడించనున్నారు. ప్రస్తుతానికి ఈ కారు 103 BHP పవర్ ఇచ్చే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 115 BHP పవర్ ఇచ్చే 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. మైల్డ్ హైబ్రిడ్‌లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుండగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ కేవలం ఈ-సివిటి గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ ఆప్షన్లను కొత్త కారులోనూ అలాగే కొనసాగించనున్నారు.
మిడ్‌లైఫ్ అప్‌డేట్‌తో వస్తున్న హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
హోండా కార్లను ఇష్టపడే వారి కోసం హోండా ఎలివేట్ సరికొత్త రూపంలో రాబోతోంది. మార్కెట్లోకి వచ్చిన ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 2026 దీపావళి నాటికి తన మొదటి పెద్ద మిడ్‌లైఫ్ అప్‌డేట్‌ను అందుకోనుంది. ఈ అప్‌డేట్‌లో భాగంగా కారు ముందు, వెనుక ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చబోతున్నారు. అలాగే కేబిన్ లోపల కస్టమర్లను ఆకట్టుకునేలా పలు కొత్త మోడ్రన్ ఫీచర్లను యాడ్ చేయనున్నారు. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా.. ప్రస్తుతం ఉన్న 121 BHP పవర్ ఇచ్చే 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే వాడనున్నారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
హైబ్రిడ్ ఇంజన్‌తో మరింత పవర్‌ఫుల్‌గా వస్తున్న రెనో డస్టర్
ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన రెనో డస్టర్ సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆర్‌జీఎమ్‌పీ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న ఈ సరికొత్త ‘రెనో డస్టర్ హైబ్రిడ్’ మోడల్ 2026 దీపావళి పండుగ సమయంలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కారులో ఏకంగా 1.8 లీటర్ సామర్థ్యం గల పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజన్‌ను ఉపయోగించబోతున్నట్లు రెనో ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఇది గరిష్టంగా 160 BHP పవర్‌ను జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి గ్రాండ్ విటారా, టొయోటా హైబ్రిడ్ కార్లతో పోలిస్తే ఈ కొత్త డస్టర్ హైబ్రిడ్ చాలా రెట్లు ఎక్కువ శక్తివంతంగా, మెరుగైన మైలేజ్‌తో రానుండటం విశేషం.

