Exter CNG Vs Punch CNG: హ్యుందాయ్ ఎక్స్‌టర్ Vs టాటా పంచ్ CNG.. రూ.10 లక్షల బడ్జెట్‌లో ఏ SUV బెస్ట్?
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఏ SUV బెస్ట్?

Exter CNG Vs Punch CNG: భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ, టాటా పంచ్ సీఎన్‌జీ మంచి ఎంపికలు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.51 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ.8.77 లక్షల వరకు ఉంటాయి. మరోవైపు టాటా పంచ్ సీఎన్‌జీ ఎంట్రీ-లెవల్ (ప్యూర్ iCNG) వేరియంట్ ధర రూ.6.68 లక్షల నుంచి మొదలవుతుంది. ధర పరంగా చూస్తే పంచ్ సీఎన్‌జీ ఎంట్రీ-లెవల్‌లో మరింత చౌకగా ఉంది. ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, రెండు కార్లలోనూ హాలొజెన్ హెడ్‌లైట్‌లు ఉన్నప్పటికీ ఎక్స్‌టర్‌లో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ అదనంగా ఉన్నాయి.
ఇంటీరియర్‌లో రెండు కార్లలోనూ ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ ఉన్నాయి. అయితే, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి: ఎక్స్‌టర్‌లో డ్రైవర్ సీటు కోసం ఎత్తును అడ్జస్ట్ చేసుకునే సదుపాయం (హైట్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్) ఉంది. పంచ్‌లో మాత్రం స్టీరింగ్‌ను టిల్ట్ చేసే సదుపాయం, డోర్లు 90 డిగ్రీల వరకు తెరుచుకునే ఫీచర్ ఉన్నాయి.
సేఫ్టీ పరంగా చూస్తే, ఎక్స్‌టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్గా రావడంతో ఇది ముందంజలో ఉంది. పంచ్‌లో ప్రస్తుతానికి 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి (త్వరలో అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది). అయితే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనే ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ మాత్రం పంచ్‌లో ఉంది, ఇది ఎక్స్‌టర్‌లో లేదు.
రెండు కార్లలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కానీ ఎక్స్‌టర్ సీఎన్‌జీలో 4-సిలిండర్ ఇంజిన్ ఉండగా, పంచ్ సీఎన్‌జీలో 3-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఎక్స్‌టర్ సీఎన్‌జీ 6000 rpm వద్ద 68 bhp పవర్‌ను, 4000 rpm వద్ద 95.2 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టాటా పంచ్ సీఎన్‌జీ 6000 rpm వద్ద 72.4 bhp పవర్‌ను, 3250 rpm వద్ద 103 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ప్రకారం పవర్, టార్క్ పరంగా టాటా పంచ్ మెరుగ్గా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఎక్స్‌టర్ కిలోకు 27.1 కిమీ మైలేజ్ ఇవ్వగా, పంచ్ 26.99కిమీ మైలేజ్ ఇస్తుంది. అంటే రెండు కార్లు దాదాపు ఒకే విధంగా మైలేజ్ ఇస్తాయి. ఫైనల్‌గా ఎక్కువ సేఫ్టీ(ఎయిర్‌బ్యాగ్‌లు) కావాలనుకునేవారికి ఎక్స్‌టర్ మంచిది. అయితే ఎక్కువ ఇంజిన్ పవర్, తక్కువ ఎంట్రీ-లెవల్ ధర కావాలనుకునేవారికి పంచ్ లాభదాయకం.

