Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..టాటా పంచ్‌కు ఇక టెన్షన్ మొదలైనట్టే
టాటా పంచ్‌కు ఇక టెన్షన్ మొదలైనట్టే

Hyundai Exter : భారతదేశ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తూ మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ ఎక్స్టర్ ఇప్పుడు సరికొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. 2023లో తొలిసారి లాంచ్ అయిన ఈ కారు, కేవలం రెండేళ్లలోనే మేకోవర్ పూర్తి చేసుకుని 2026 ఆరంభంలో రోడ్లపైకి రానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన లీకులు ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్ను అప్‌గ్రేడ్ చేసే పనుల్లో నిమగ్నమైంది. ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారు టెస్ట్ మ్యూల్స్ క్లాత్‌తో కప్పి ఉండటం కనిపించింది. దీనిని బట్టి చూస్తే, ఫ్రంట్, రియర్ బంపర్లలో కంపెనీ కీలక మార్పులు చేస్తోందని అర్థమవుతోంది. హెచ్-షేప్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు అలాగే కొనసాగినప్పటికీ, రేడియేటర్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ డిజైన్ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయి. కారు వెనుక భాగంలో టెయిల్ లైట్ల మధ్య ఉన్న కనెక్టింగ్ స్ట్రిప్ మరింత స్టైలిష్‌గా మారనుంది.
కారు లోపలి భాగానికి వస్తే, హ్యుందాయ్ ఫీచర్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో డ్యూయల్-పేన్ సన్‌రూఫ్ వచ్చే అవకాశం ఉంది, ఇది ఈ సెగ్మెంట్‌లో అతిపెద్ద హైలైట్ కానుంది. అలాగే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన సీట్ కంఫర్ట్‌ను కంపెనీ జోడించనుంది. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా ఆర్మ్‌రెస్ట్, వెనుక ప్రయాణికుల కోసం స్ప్లిట్-ఫోల్డింగ్ సీట్లు వంటి సౌకర్యాలు రాబోతున్నాయి. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తున్న ఈ కారులో మరికొన్ని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు చేరే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న నమ్మకమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే హ్యుందాయ్ కొనసాగించనుంది. ఇది 82 bhp పవర్ మరియు 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈసారి సీఎన్‌జీ ప్రియుల కోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. అదే CNG-AMT కాంబినేషన్. గ్యాస్ కిట్‌తో ప్రయాణించేటప్పుడు కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని అందించడం ద్వారా సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 'ట్విన్ సిలిండర్' సీఎన్‌జీ టెక్నాలజీ వల్ల బూట్ స్పేస్ సమస్య కూడా ఉండదు.
టాటా పంచ్ ఇటీవల తన మోడల్‌ను అప్‌డేట్ చేయడంతో, దానికి దీటుగా సమాధానం చెప్పేందుకు హ్యుందాయ్ ఈ ఫేస్‌లిఫ్ట్‌ను సిద్ధం చేసింది. విక్రయాల పరంగా పంచ్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఫీచర్లు మరియు రిఫైన్డ్ ఇంజిన్ పరంగా ఎక్స్టర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అధికారికంగా లాంచ్ తేదీ ప్రకటించనప్పటికీ, 2026 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లోపు పాత స్టాక్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.

