Hyundai Exter: రూ.8.13 లక్షలకే స్పోర్టీ లుక్..హ్యుందాయ్ కొత్త ఎక్స్‌టర్ ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే
కొత్త ఎక్స్‌టర్ ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే

Hyundai Exter: చిన్న ఎస్‌యూవీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన నైట్ ఎడిషన్ అవతారంలో సందడి చేసేందుకు వచ్చేసింది. ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ థీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ కొత్త వేరియంట్ కారు లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నైట్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.8.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ.9.60 లక్షల వరకు ఉంది. స్పోర్టీ డిజైన్, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కారు మిగతా మైక్రో ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
లోపల కూడా కంప్లీట్ ఆల్-బ్లాక్ మ్యాజిక్
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ బయటి రూపాన్ని గమనిస్తే హ్యుందాయ్, ఎక్స్‌టర్ బ్యాడ్జింగ్‌లు మ్యాట్ బ్లాక్ కలర్‌లో మెరిసిపోతున్నాయి. ముందు, వెనుక బంపర్లపై డార్క్ గ్రే గార్నిష్ ఇచ్చారు. డార్క్ గ్రే కలర్ సైడ్ గార్నిష్‌తో పాటు ప్రత్యేకమైన నైట్ బ్యాడ్జింగ్, 15 అంగుళాల నల్లటి అల్లాయ్ వీల్స్ కారుకు మంచి స్పోర్టీ టచ్ ఇచ్చాయి. ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ రెడ్ కలర్‌లో ఉండటం బ్లాక్ థీమ్‌కు మరింత లుక్ తెచ్చిపెట్టింది. టైటానియం బ్లాక్, అట్లాస్ వైట్, స్టారీ నైట్, టైటన్ గ్రే, గోల్డెన్ బ్రాంజ్ రంగుల్లో ఇది లభిస్తుంది. కారు కేబిన్ లోపల కూడా ఆల్-బ్లాక్ థీమ్‌తో పాటు డ్యాష్‌బోర్డ్‌పై బ్రాస్ కలర్ స్పర్శలు ఇచ్చారు. ఎంబర్ ఫుట్‌వెల్ యాంబియంట్ లైటింగ్, బ్లాక్ సెమీ ఫ్యాబ్రిక్ సీట్లు, డి-కట్ స్టీరింగ్ వీల్ ప్రయాణీకులకు రాయల్ అనుభూతిని అందిస్తాయి.
పవర్‌ఫుల్ ఇంజిన్.. సీఎన్జీ వెర్షన్‌లోనూ లభ్యం
ఈ కొత్త ఎడిషన్‌లో ఇంజిన్ లేదా మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పాత విశ్వసనీయమైన 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులో కొనసాగించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇంధన పొదుపు కోరుకునే వారి కోసం 1.2-లీటర్ హై-సీఎన్‌జీ డ్యూయో ఇంజిన్ వెర్షన్‌ను కూడా హ్యుందాయ్ అందిస్తోంది. ప్రయాణికుల వినోదం, రక్షణ కోసం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు పొందుపరిచారు.
నైట్ సిరీస్‌కు సక్సెస్ ఊపు
2022 లో హ్యుందాయ్ ప్రారంభించిన నైట్ ఎడిషన్ మోడళ్లకు భారతీయ కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఏకంగా లక్షకు పైగా నైట్ ఎడిషన్ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఎక్స్‌టర్‌లో కూడా ఈ ఎడిషన్ తీసుకురావడం ద్వారా యువతను, స్పోర్టీ కార్ల అభిమానులను మరింతగా ఆకట్టుకోవచ్చని హ్యుందాయ్ భావిస్తోంది.

