Hyundai : టాటా, మహీంద్రా, మారుతీలకు గట్టి షాక్.. మార్కెట్లోకి హ్యుందాయ్ 2 కొత్త ఎస్‌యూవీలు
మార్కెట్లోకి హ్యుందాయ్ 2 కొత్త ఎస్‌యూవీలు

Hyundai : దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఫ్యూచర్ లైనప్‌పై కీలక ప్రకటన చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే రెండు కొత్త ఎస్‌యూవీ మోడళ్లతో పాటు, ఇండియాలోనే తయారయ్యే ఒక మేడ్-ఇన్-ఇండియా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ మోడళ్లకు సంబంధించిన పేర్లను, పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం అందులో ఒకటి హ్యుందాయ్ బేయాన్ ఆధారిత మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కాగా, మరొకటి తదుపరి తరం హ్యుందాయ్ క్రెటా అని తెలుస్తోంది.
హ్యుందాయ్ బేయాన్ ఆధారిత ఎస్‌యూవీ ప్రత్యేకతలు
ప్రస్తుతం ఐరోపాలోని పలు దేశాల్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ బేయాన్ మోడల్‌ను ఆధారంగా చేసుకుని భారత్ కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్నారు. ఇది మార్కెట్లో మారుతీ సుజుకీ విక్టోరిస్‌తో పాటు మిగిలిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో నేరుగా పోటీపడనుంది. హ్యుందాయ్ కార్ల లైనప్‌లో దీనిని వెన్యూ, క్రెటాలకు మధ్యస్థంగా ఉంచే అవకాశం ఉంది. ఈ మోడల్ సెప్టెంబర్ 2026 నాటికి మార్కెట్లో అరంగేట్రం చేస్తుందని అంచనా వేస్తున్నారు. పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే.. ఇది 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండి, సిఎన్‌జి (CNG) ఆప్షన్‌తో వస్తున్న హ్యుందాయ్ తొలి ఎస్‌యూవీగా నిలవనుంది. ఇందులో ప్రస్తుతం క్రెటాలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చే అవకాశం ఉంది.
2027 హ్యుందాయ్ క్రెటాలో ఊహించని మార్పులు
ఇక భారత్‌లో భారీ సేల్స్ సాధిస్తున్న హ్యుందాయ్ క్రెటా కూడా సరికొత్త మోడల్‌గా రూపాంతరం చెందబోతోంది. కొత్త క్రెటాలో తీసుకురాబోతున్న అత్యంత కీలకమైన మార్పు ఏంటంటే.. దీనిని హైబ్రిడ్ ఇంజిన్‌తో పరిచయం చేయడమే. ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే యోచనలో ఉన్నారు. దీనితో పాటు వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా యథావిధిగా లభిస్తాయి. అంతేకాకుండా, ప్రస్తుత మోడల్ కంటే కొత్త క్రెటా మరింత పొడవుగా, వెడల్పుగా ఉండటం వల్ల లోపల కేబిన్ స్పేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ కారు డిజైన్ 2025 లాస్ ఏంజెల్స్ ఆటో షోలో ప్రదర్శించిన హ్యుందాయ్ క్రాటర్ కాన్సెప్ట్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
హైటెక్ ఫీచర్లు, అధునాతన సేఫ్టీ టెక్నాలజీ
సాంకేతికత పరంగా కొత్త క్రెటా కార్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది. హ్యుందాయ్ నుంచి వస్తున్న తొలి సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్ గా ఇది రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. కారు కనెక్టివిటీ కోసం ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్ కోసం గ్లియో ఐఏ అసిస్టెంట్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ప్రత్యేక యాప్ స్టోర్, ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యేలా ఓటీఏ అప్‌డేట్స్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇవే కాకుండా సరికొత్త ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్ డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన అధునాతన అడాస్ సేఫ్టీ టెక్నాలజీ, వెనుక సీట్ ప్రయాణికులకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌ల లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ప్యాక్ చేశారు. ఈ రెండూ రాకతో ఇండియన్ కార్ మార్కెట్‌లో హ్యుందాయ్ తిరుగులేని శక్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

