Hyundai Ioniq V : ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 600కిమీ రేంజ్.. హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది
హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది

Hyundai Ioniq V : భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ పోటీలో తన ముద్ర వేయడానికి కొరియన్ కార్ల దిగ్గజం హ్యుందాయ్ నడుం బిగించింది. ఆటో చైనా 2026 వేదికగా తన సరికొత్త అద్భుతం హ్యుందాయ్ అయానిక్ Vను ప్రపంచానికి పరిచయం చేసింది. అదిరిపోయే రేంజ్, కళ్లు చెదిరే డిజైన్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో వచ్చిన ఈ కారు ఇప్పుడు గ్లోబల్ ఈవీ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం డిజైన్ తోనే కాదు, ఫీచర్లతోనూ టెస్లా వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.
600 కిలోమీటర్ల భారీ రేంజ్
ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ వచ్చే మొదటి డౌట్ రేంజ్ ఎంత?. ఈ విషయంలో హ్యుందాయ్ అయోనిక్ V కస్టమర్లకు భారీ భరోసా ఇస్తోంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధీమాగా చెబుతోంది. అంటే లాంగ్ ట్రిప్స్ వేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సిటీ ట్రాఫిక్ లో అయితే కనీసం వారం రోజుల పాటు ఛార్జింగ్ వైపు చూడక్కర్లేదని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ డిజైన్
అయోనిక్ V డిజైన్ చూస్తే ఇది సెడాన్ కారా లేక ఎస్‌యూవీనా? అన్న సందేహం రాక మానదు. రెండింటి కలయికతో ఒక సరికొత్త క్రాస్ ఓవర్ లుక్ లో దీనిని రూపొందించారు. స్లిమ్ గా ఉండే LED లైట్లు, గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా ఉండే ఏరోడైనమిక్ బాడీ డిజైన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. రోడ్డు మీద ఈ కారు వెళ్తుంటే అందరూ ఆగి చూడాల్సిందే. దీని షేప్ చాలా మోడ్రన్ గా ఉండి, ఫ్యూచరిస్టిక్ కార్ల ఎలా ఉంటాయో కళ్ల ముందు ఉంచుతోంది.
లోపల 27 అంగుళాల 4K స్క్రీన్ మెరుపులు
ఈ కారు కేబిన్ లోకి అడుగుపెడితే ఏదో లగ్జరీ హోటల్ లోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. ఏకంగా 27 అంగుళాల భారీ 4K స్క్రీన్! ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గానే కాకుండా కారుకు సంబంధించిన కంట్రోల్స్ అన్నింటినీ చూపిస్తుంది. ప్రీమియం మెటీరియల్స్, అడ్వాన్స్‌డ్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌తో కారు లోపల వాతావరణం చాలా విలాసవంతంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎక్కడా విసుగు రాకుండా అన్ని సౌకర్యాలను హ్యుందాయ్ కల్పించింది.
సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్
కేవలం అందం, రేంజ్ మాత్రమే కాదు.. పర్ఫార్మెన్స్ లోనూ అయోనిక్ V తోపు అనిపించుకుంటోంది. పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ వల్ల సెకన్ల వ్యవధిలోనే ఇది గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇక భద్రత విషయానికి వస్తే.. లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ వంటి టెక్నాలజీలను ఇందులో జోడించారు. దీనివల్ల ప్రయాణం సుఖమయం మాత్రమే కాదు, సురక్షితంగా కూడా ఉంటుంది. ప్రస్తుతానికి చైనా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని దీనిని తెచ్చినప్పటికీ, త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

