కారు కొంటే రూ.1.69 లక్షలు మీ జేబులో ఉన్నట్టే

Hyundai : కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరుగుతాయని ఒకవైపు చెబుతూనే, మరోవైపు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. హ్యుందాయ్ పాపులర్ మోడల్స్‌పై ఏకంగా రూ.1.69 లక్షల వరకు ప్రయోజనాలను పొందే అవకాశం కల్పించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన గ్రాండ్ i10 నియోస్, ఎక్స్టర్ వంటి కార్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ తన ప్యాసింజర్ వాహనాలపై జనవరి నెలకు సంబంధించి భారీ సేవింగ్స్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డిస్కౌంట్లు కేవలం 2025లో తయారైన వాహనాలపై మాత్రమే వర్తిస్తాయి. అంతేకాదు, జనవరి 1 నుంచి 31 మధ్య కారు టెస్ట్ డ్రైవ్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

హ్యుందాయ్ చిన్న ఎస్‌యూవీ అయిన ఎక్స్టర్ మీద ప్రస్తుతం అత్యధికంగా రూ.1,69,209 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో జీఎస్టీ తగ్గింపు రూపంలో రూ.89,209 ఉండగా, మిగిలిన రూ.80,000 అదనపు ప్రయోజనాల కింద పొందవచ్చు. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఎక్స్టర్ ఇప్పుడు మరింత చౌకగా లభించనుంది.

మరోవైపు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ బేస్ మోడల్ ధర కేవలం రూ.5.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. దీనిపై కూడా దాదాపు రూ.1.43 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక సెడాన్ ప్రియుల కోసం హ్యుందాయ్ ఆరా మీద రూ.1,06,465 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో జీఎస్టీ తగ్గింపు రూ.78,465, రూ.28,000 అదనపు డిస్కౌంట్లు ఉన్నాయి. వేరియంట్, నగరాన్ని బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

అయితే అందరికీ ఈ ఆఫర్లు లభించవు. హ్యుందాయ్ మోస్ట్ పాపులర్ కార్లయిన క్రెటా, వెన్యూ పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు. ఈ కార్లకు ఉన్న ఫుల్ డిమాండ్ కారణంగా వాటిపై ఆఫర్లు లేవు. అలాగే, తమిళనాడు రాష్ట్రంలోని కస్టమర్లకు ఈ జనవరి ఆఫర్లు వర్తించవని కంపెనీ నోట్ ఇచ్చింది. గ్రాండ్ i10 నియోస్, i20, ఆరా, ఎక్స్టర్, వెర్నా, అల్కజార్ కొనేవారికి మాత్రమే ఈ సువర్ణావకాశం అందుబాటులో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story